థియేటర్లకు మళ్లీ పునరుత్తేజం తీసుకురావడం ఎలా? జనం మళ్లీ థియేటర్ల బాట పట్టాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం చిత్రసీమని వేధిస్తున్న ప్రశ్నలివే. ఓటీటీల మెరుపుదాడి, కరోనా భయాల వల్ల – థియేటర్ వ్యవస్థ ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు మళ్లీ జనాలకు థియేటర్లను అలవాటు చేయాలి. దీని కోసం ఏం చేయాలి? సురేష్ బాబు దగ్గర ఓ మాస్టర్ ఐడియా ఉంది. అదే.. `సూపర్ స్క్రీన్స్`.
పట్నాలలో గేటెడ్ కమ్యునిటీల హవా ఎక్కువ. గేటెడ్ కమ్యునిటీల్లో జిమ్స్, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లూ ఎలా ఉంటాయో.. థియేటర్లు కూడా అలా ఏర్పాటు చేసుకోవచ్చు కదా అన్నది సురేష్ బాబు ఆలోచన. దానికి సూపర్ స్క్రీన్స్ అని నామకరణం చేశారు.. అంటే గేటెడ్ కమ్యునిటీ కోసం థియేటర్లు కట్టాలన్నమాట. ఇది మంచి ఆలోచనే. హైదరాబాద్ లాంటి పట్నాలలో వందలాది గేటెడ్ కమ్యునిటీలు ఉంటాయి. అందులో థియేటర్లకు అనువైన స్థలాలు ఎన్నుంటాయన్నది పెద్ద ప్రశ్న. వాటి నిర్వహణ… పెట్టుబడి ఎవరికి ఇస్తారు? ఇవన్నీ ఆ గేటెడ్ కమ్యునిటీ వాళ్ల చేతుల్లోనేఉంటాయా? లేదంటే అక్కడ కూడా `ఆ నలుగురు` ఆక్రమిస్తారా? అనేవి త్వరలో ఎదురు కాబోయే ప్రశ్నలు. ఓటీటీలకు ధీటుగా థియేటర్ వ్యవస్థ బలపడాల్సిన అవసరం ఉందని, గేటెడ్ కమ్యునిటీలలోనే కాకుండా త్వరలో బ్యాంకుల్లోనూ థియేటర్లు వస్తాయని, బ్యాంకులు తమ వ్యాపారాభివృద్ధి కోసం, కష్టమర్లని ఆకర్షించడానికి థియేటర్లు ఏర్పాటు చేయబోతున్నారని సురేష్ బాబు జోస్యం చెప్పారు. ఏ విషయంలోనైనా పదేళ్లు ముందుకెళ్లి ఆలోచించడం సురేష్ బాబు ప్రత్యేకత. ఆయన చెప్పింది నిజమైపోతుందేమో మరి.