ఈవారం మూడు సినిమాలొస్తున్నాయి. ఒకే వారం మూడు సినిమాలు రావడం బాక్సాఫీసుకి కొత్తేం కాదు. కాకపోతే… మూడూ అంచనాలున్న చిత్రాలే. భారీగానూ ఖర్చు పెట్టారు. జయ జానకి నాయక, నేనే రాజు – నేనే మంత్రి, లై.. మూడూ పోటీపడబోతున్నాయి. వీకెండ్‌తో పాటు, ఆగస్టు 15 సెలవు కూడా కలసి రావడంతో మూడు సినిమాలూ ఈ రిలీజ్ డేట్‌ని వదులుకోకూడదనుకొంటున్నాయి. అయితే.. మూడూ ఒక్కసారే రావడం మూడు సినిమాలకూ మంచిది కాదు. వసూళ్లు పంచుకోవడం మినహా.. ఒరిగేదేం ఉండదు. మూడింటిలో స్టార్ హీరో ఎవ్వరూ లేరు. ఏ సినిమా అందుబాటులో ఉంటే, ఆ సినిమాకే ప్రేక్షకులు మొగ్గు చూపడం తథ్యం. సినిమా బాగుందన్న టాక్ చూసి, థియేటర్లకు వెళ్దామనుకొన్నా తప్పుపట్టలేం.
అంటే.. మూడింటిలో ఏ సినిమాకీ బంపర్ వసూళ్లు రావు. ఆర్థికంగా మూడు సినిమాలకూ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇందులో సూపర్ హిట్ అనిపించుకొన్న సినిమాకి మాత్రం మంచి వసూళ్లు దక్కినా – మిగిలిన రెండూ నష్టపోతాయి. అందుకే తమలోంచి ఒకరు డ్రాప్ అయితే మంచిదన్నది సురేష్ బాబు అభిప్రాయం. ముగ్గురు నిర్మాతలూ ఓ మీటింగ్ పెట్టుకొని – తమలో తాము మాట్లాడుకొని, ఓ నిర్ణయానికి రావాలన్నది ఆయన ప్రయత్నం. ఇన్ని చెప్పే బదులు ఆయన తీసిన `నేనే రాజు – నేనే మంత్రి`ని ఆపేయొచ్చు కదా? అంటే అది కుదర్దట. ఓ వారం ఆగితే తమిళ నాట కొత్త సినిమాలు వచ్చేస్తాయన్నది ఆయన భయం. నేనే రాజు తమిళంలోనూ భారీ ఎత్తున విడుదల చేసే సన్నాహాల్లో ఉన్నారాయన. అందుకే.. 11న సినిమా విడుదల అవ్వాల్సిందే అంటున్నారు. అంటే ఆయన గురి మిగిలిన రెండు సినిమాలపై ఉందన్నమాట. వాటిలో ఒకటి డ్రాప్ చేయించాలని విశ్వప్రయత్నాల్లో ఉన్నారు. మరి సురేష్ బాబు మాటలకు… రెండు సినిమాల్లో ఎవరు పడతారో చూడాలి.