ప్రముఖ మలయాళీ సినిమా నటుడు సురేష్ గోపిని కేంద్రప్రభుత్వం కళాకారుల కోటాలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసింది. కొన్ని రోజుల క్రితం భాజపా అధ్యక్షుడు అమిత్ షా ఆయనతో భేటీ అయిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకోవడం గమనిస్తే అది కేరళ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకొన్న నిర్ణయమేనని అర్దమవుతుంది. కేరళలో భాజపాకి సరయిన గుర్తింపే లేదు. అక్కడ చాలా దశాబ్దాలుగా కాంగ్రెస్, వామపక్ష కూటముల మధ్యనే అధికార మార్పిడి జరుగుతోంది. కనుక ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే రాష్ట్ర ప్రజలందరికీ చిరపరిచితమయిన వ్యక్తిని పార్టీ ‘ఐకాన్’ గా ముందుంచుకొని సాగవలసి ఉంటుంది. అప్పుడే ఏవయినా ఓట్లు రాలే అవకాశం ఉంటుంది. అందుకే సురేష్ గోపిని భాజపా తరపున శాసనసభకు పోటీ చేయాలని కోరింది. ఆయన అందుకు అంగీకరించలేదు కానీ పార్టీ తరపున ఎన్నికలలో ప్రచారం చేస్తానని మాటిచ్చారు. అందుకు ప్రతిగా మోడీ సర్కార్ ఆయనకు రాజ్యసభ సీటు బహుమానంగా ఇచ్చిందని భావించవచ్చు.
క్రికెటర్ శ్రీశాంత్ తిరువనంతపురం నియోజకవర్గం నుంచి భాజపా తరపున పోటీ చేయడానికి అంగీకరించారు. కనుక శ్రీశాంత్, సురేష్ గోపీలను ముందుంచుకొని ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో అడుగుపెట్టాలని భాజపా ఆలోచన. అయితే కేరళ ప్రజలు దశాబ్దాల తరబడి ఆ రెండు కూటములకే అధికారం కట్టబెడుతున్నప్పుడు శ్రీశాంత్, సురేష్ గోపీలు కలిసి ప్రజలను భాజపావైపు ఆకర్షించగలరా? భాజపాకి గౌరవప్రదమయిన సీట్లు సాధించిపెట్టగలరా? మే 19న ఫలితాలు వెలువడినపుడు తెలుస్తుంది. అంతవరకు వేచి చూడాలి.