కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు.. శుక్రవారం హఠాత్తుగా అమరావతి వచ్చారు. జగన్ ఆయన కోసం.. కేబినెట్ సమావేశాన్ని గంట సేపు కుదించుకున్నారు. సురేష్ ప్రభుకు విందు ఇచ్చి గంట సేపు ఏకాంతంగా చర్చలు జరిపారు. రెండు గంటల వరకూ జరగాల్సిన కేబినెట్ భేటీని ఈ చర్చల కోసమే జగన్ గంట ముందు ముగించారు. మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ ఎంపీలకే సమయం ఇవ్వరు. ఇచ్చినా.. నిలబడి మాట్లాడి వెళ్లాల్సింది. కేంద్ర మంత్రి కూడా కాని… పైగా.. టీడీపీ మద్దతుతో రాజ్యసభకు .. ఏపీ నుంచి ఎన్నికైనా.. బీజేపీ ఎంపీగా ఉన్న నేతతో విందు భేటీ ఏర్పాటు చేసుకున్నారంటే.. కచ్చితంగా ఏదో విశేషం ఉందనే అనుకుంటున్నారు.
సురేష్ ప్రభు.. అమిత్ షా, మోడీలకు సన్నిహితుడు. పట్టణాభివృద్ది రంగంలో నిపుణులు. ఆయన మోడీ, షా తరపున దూతగా వచ్చారా…లేక మర్యాదపూర్వకంగా జగన్ ను కలిశారో బయటకు రాలేదు. కానీ ఏకాంతంగా చర్చలు జరిపారు కాబట్టి.. ఖచ్చితంగా రాజకీయం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయన అమరావతిపై మోడీ, షాల అభిప్రాయాన్ని జగన్కు చేరవేశారని అంటున్నారు. మరో వైపు ఆరెస్సెస్ కూడా.. రాజధాని తరలింపును సీరియస్గా తీసుకుందని ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మినారాయణతో పాటు.. కొంత మంది బీజేపీ నేతలు.. ఆరెస్సెస్, బీజేపీ నేతలు సీరియస్గా చర్చలు జరిపారు.
పాలన వికేంద్రీకరణకు వ్యతిరేకంగా స్పందించాల్సిందేనని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. జగన్ నిర్ణయానికి మొదట్లో కాస్త సానుకూలంగా స్పందించిన కన్నా.. ఆ తర్వాత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటించి..మౌనదీక్ష కూడా చేశారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ నుంచి .. అమరావతి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం జగన్ నిర్ణయాన్ని ఎలా ప్రభావితం చేయగలదో చూడాలి..!