ఆంధ్రప్రదేశ్ నుంచి తెదేపా తరపున రాజ్యసభకి ఏకగ్రీవంగా ఎన్నికైన రైల్వే మంత్రి సురేష్ ప్రభు శనివారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి కృతజ్ఞతలు తెలుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టలు, విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాజధాని అమరావతికి రైల్వే మార్గం నిర్మాణ పనులను సురేష్ ప్రభు ఇవ్వాళ్ళ ప్రారంభించబోతున్నారు.
ప్రత్యేక హోదా తరువాత రాష్ట్ర ప్రజలు అంతటి ప్రాధాన్యతనిస్తున్న మరో అంశం విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి అనేక సమస్యలు, అవరోధాలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల అభ్యంతరాలున్నాయి కనుక ఇవ్వడం లేదని సరిపెట్టుకొన్నా, రెండేళ్ళు పూర్తయినా రైల్వే జోన్ ఏర్పాటు చేయకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దానికి కూడా ఒక కమిటీ వేసి చేతులు దులుపుకొంది. గట్టిగా అడిగితే కమిటీ పరిశీలన, ఓడిశా ప్రభుత్వం అభ్యంతరాలు సాకులుగా చూపుతూ కాలక్షేపం చేస్తోంది.
ఇప్పుడు సాక్షాత్ రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రా నుంచి తెదేపా తరపున రాజ్యసభకి ఎన్నికైనందున, అయన తప్పకుండా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికిప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేయబోతున్నట్లు సురేష్ ప్రభు ప్రకటించకపోయినా, ఇవ్వాళ్ళ ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో దానిపై కొంత స్పష్టత వస్తుందని తెదేపా నేతలు కూడా ఆశిస్తున్నారు.
ఇదివరకు అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిధిగా వచ్చినప్పుడు, చెంబుడు నీళ్ళు, పిడికెడు మట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్ళారు. అది తమని అవమానించినట్లేనని రాష్ట్ర ప్రజలు భావించారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక రైల్వే మంత్రి సురేష్ ప్రభు ఇప్పటికీ రైల్వే జోన్ గురించి స్పష్టత ఈయకుండా అదే నాన్పుడు ధోరణితో వ్యవహరించి వెళ్లిపోయినట్లయితే, అది మరొకసారి అవమానించినట్లేనని రాష్ట్ర ప్రజలు భావించే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ రాష్ట్రంలో రైల్వే జోన్ కోసం ఉద్యమాలు మొదలవడం తధ్యం.
ఏపికి రైల్వే జోన్ తప్పకుండా ఇస్తామని రాష్ట్ర భాజపా నేతలు పదేపదే చెపుతున్నప్పుడు, అదేదో త్వరగా ఇస్తే వారికీ గొప్పగా చెప్పుకొని ప్రజల మెప్పు పొందడానికి ఉంటుంది. అలాకాక దాని కోసం ఉద్యమాలు జరిగిన తరువాత ఇచ్చినా ఆ క్రెడిట్ భాజపాకి దక్కదు. దాని కోసం ఉద్యమించిన పార్టీలకే దక్కుతుంది. తామే కేంద్రం మెడలు వంచి రైల్వే జోన్ సాధించుకొన్నామని వాళ్ళు గర్వంగా చెప్పుకొంటుంటే, రాష్ట్ర భాజపా నేతలు అది మా ప్రభుత్వమే ఇచ్చిందని ప్రజలకు నచ్చ జెప్పుకోవలసిన పరిస్థితి కలుగుతుంది.
తెలంగాణా సాధించిన ఘనత మాదంటే మాదని భాజపా, కాంగ్రెస్ పార్టీలు చెప్పుకొన్నప్పటికీ ప్రజలు ఆ రెండు పార్టీలను పట్టించుకోకుండా తెరాసకు అధికారం కట్టబెట్టారు. ఒకవేళ ఇప్పటికీ రైల్వే మంత్రి సురేష్ ప్రభు రైల్వే జోన్ పై నిర్దిష్టమైన ప్రకటన చేయకపోతే రాష్ట్ర భాజపా నేతలకి కూడా అటువంటి అనుభవమే ఎదురవవచ్చు. కనుక అటువంటి పరిస్థితి రాకమునుపే రైల్వే జోన్ ఏర్పాటు చేసి ఆ క్రెడిట్ స్వంతం చేసుకొంటే భాజపాకి కూడా మేలు కలుగుతుంది. ప్రజలు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు అందరూ కూడా సంతోషిస్తారు.