ఆర్టికల్ 370, కశ్మీర్ విభజనపై… దేశం మొత్తం చర్చించుకుంటున్నారు కానీ.. రైతలకు ఈ మధ్యలోనే రైతులకు కేంద్రం ఓ వాత పెట్టిందని గుర్తించలేకపోయారు. రైతులకు ఇక బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలను.. ఎంత మాత్రం వ్యవసాయరుణాలుగా పరిగణించలేమని.. కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సాధారణంగా బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకుంటే.. వాటికి వడ్డీ తక్కువగా పడుతుంది. సాధారణ రుణాలకు… పదకొండు శాతం వరకూ వడ్డీ ఉంటే.. వ్యవసాయ రుణాలకు.. ఆ వడ్డీ ఆరు లేదా ఏడు శాతం మాత్రమే ఉంటుంది. మూడు లక్షలలోపు రుణాలకు… ఈ వడ్డీ కూడా… సున్నా వడ్డీ పథకం కింద ప్రభుత్వాలు చెల్లిస్తూ ఉంటాయి. తెలంగాణ, ఏపీల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఇప్పుడు కేంద్రం కొత్తగా ఇచ్చిన ఆదేశాలతో.. బంగారం కుదువ పెట్టి తీసుకునే వ్యవసాయ రుణాలు.. మామూలు రుణాల ఖాతాలోకే వస్తాయి. వాటికి వడ్డీ మినహాయింపు లభించదు.
బంగారం కుదువ పెడితే ఇక వ్యవసాయ రుణాల్లేవ్..!
ప్రతి ఏటా.. బ్యాంకర్లకు… వ్యవసాయ రుణాలు ఎంత మేర ఇవ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తుంది. దీని ప్రకారం… రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి.. ఎస్ఎల్బీసీ ఏ పంటకు .. ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయించుకుని.. ఆ మేరకు.. రైతులకు రుణాలు మంజూరు చేస్తాయి. అయితే.. రైతులకు ఇచ్చే ఆ రుణాలు సరిపోవు. అందుకే వారు.. తమ వద్ద ఉన్న బంగారం.. బ్యాంకుల్లో పెట్టుకుని మరింత రుణం తెచ్చుకుని సాగు చేస్తారు. ఈ రుణం కూడా.. వ్యవసాయ రుణం కిందనే ఉంటుంది. అందుకే వడ్డీ రాయితీ లభించేది. ఇప్పుడు.. హఠాత్తుగా కేంద్రం.. బంగారు రుణాల్ని… వ్యవసాయ రుణాలుగా పరిగణించవద్దని ఆదేశించడంతో.. ఇప్పుడు ఈ మొత్తం భారం రైతులపై పడనుంది.
వడ్డీ లేని రుణాల పథకానికి వరమా..? భారమా..?
రైతులు ఎంత రుణం తీసుకున్నా.. వడ్డీ ప్రభుత్వమే కడుతుందని ప్రకటించిన ఏపీ సర్కార్కు కేంద్ర నిర్ణయం ఇబ్బందికరంగా మారింది. బ్యాంకులు వ్యవసాయ రుణాలుగా పరిగణించిన వాటికి మాత్రమే… వడ్డీని మాఫీ చేస్తారు. ఇప్పుడు రైతులు.. బంగారం తాకట్టు పెట్టి తీసుకునే వ్యవసాయ రుణాలు ఉండవు. కానీ మామూలుగా ఇచ్చే వ్యవసాయ రుణాలు.. రైతులకు సరిపోవు. ఇప్పుడు.. రైతులు.. కచ్చితంగా… తాము తీసుకునే బంగారం రుణాలకు కూడా.. వడ్డీ మినహాయింపు ఇవ్వాలని ఏపీ సర్కార్ ను డిమాండ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా.. ఇచ్చిన మాట ప్రకారం.. రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందేలా చూడాల్సి ఉంది. బంగారు రుణాలను కేంద్రం వ్యవసాయం జాబితా నుంచి తొలగించింది కాబట్టి.. వడ్డీ మాఫీ చేయమని సీఎం జగన్ చెబితే.. అది రైతుల్లో అసంతృప్తికి కారణం కావొచ్చు. సర్కార్ భరించడానికి ముందుకు వస్తే.. ఆర్థికంగా భారం పెరుగుతుంది.
ఆ పథకానికి నిధులు..ఈ వడ్డీ రాయితీ నుంచే మిగిలిస్తున్నారా..?
రైతులకు ఎంత చేసినా తక్కువే అనే ప్రభుత్వాలు… ఓ పథకం పెట్టి.. మరో పథకాన్ని నిలిపివేస్తూ… మాయ చేస్తున్నాయనే విమర్శలు.. ప్రభుత్వ చర్యల ద్వారా వస్తున్నాయి. కేంద్రం పెట్టుబడి సాయం కింద.. రైతులకు రూ. ఆరు వేల సాయం అందించే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు.. బంగారం రుణాలకు.. వడ్డీ రాయితీ సదుపాయం తీసేయడంతో… రైతులకు అంత కంటే ఎక్కువగానే నష్టం జరుగుతుందనే అభిప్రాయం ఏర్పడుతోంది. ఏపీ సర్కార్.. రైతు భరోసా కింద ఇస్తానన్న.. రూ. 12500లో.. ఇప్పటికే రూ. ఆరు వేలు కేంద్రానివని చెప్పేసింది. మిగిలిన రూ. 6500 కూడా.. కట్ చేసిన వడ్డీని తిరిగిస్తున్నట్లుగా అయ్యే పరిస్థితి తాజా నిర్ణయంతో ఏర్పడింది.