సినిమా స్థాయి పెరుగుతూ వెళ్తోంది. ఇది వరకు ఓ సినిమాకు వంద కోట్లు రావడమే విడ్డూరం. ఇప్పుడు స్టార్ సినిమా బాగుంటే చాలు. 500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ రాబట్టుకోవొచ్చన్న సంగతి అర్థమైంది. `దంగల్` ఏకంగా రూ.2 వేల కోట్లు సాధించి ఓ మైలు రాయి సెట్ చేసింది. అప్పటి నుంచీ ఆ రికార్డ్ దాటాలని చాలా సినిమాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. బాహుబలి 2, ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు వేయి కోట్ల క్లబ్‌లోనూ చేరగలిగాయి. అయితే… తమిళనాట నుంచి ఒక్క సినిమా కూడా వేయి కోట్ల మైలు రాయి దాటలేదు. రజనీకాంత్, విజయ్‌లకు కూడా ఈ మ్యాజిక్ సాధ్యం కాలేదు. కానీ ‘కంగువా’తో సూర్య 2 వేలకోట్లు కొట్టేస్తాడని, ఇది తథ్యమని నిర్మాత జ్ఞానవేల్ రాజా జోస్యం చెప్పారు. దీనిపై పెద్ద కాంట్రవర్సీనే రేగింది. జ్ఞానవేల్ ది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ తమిళ మీడియా వర్గాలే జోకులు వేశాయి. దీనిపై సూర్య స్పందించారు.
‘కంగువా’ ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా సూర్య 2 వేల కోట్ల వసూళ్లపై స్పందించారు. ‘మీ సినిమా 2 వేల కోట్లు సాధిస్తుందని నిర్మాత చెప్పారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి’ అని సూర్యని అడిగితే ”ఆశిస్తే తప్పేంటి? పెద్ద విషయాల్ని టార్గెట్ చేసుకొంటే నష్టం ఏముంది? బాహుబలి, కేజీఎఫ్‌లాంటి సినిమాలు వందల కోట్లు కొల్లగొట్టాలని తీసి ఉండరు. సినిమాపై ప్రేమతోనే తీసి ఉంటారు. మేమూ అంతే. ఆ ప్రయాణంలో వసూళ్లు కూడా వస్తాయి” అనే ఆశాభావం వ్యక్తం చేశారు. శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవంబరు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిశాపటానీ కథానాయిక.