ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్)ని చిత్రసీమ వాడుతున్నట్టు ఇంకెవరూ వాడడం లేదేమో..? ఏఐ సహాయంతో దివంగత నటీనటుల్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ‘గోట్’ సినిమాలో విజయ్‌కాంత్ పాత్రని తీసుకురావడం అందుకు ఓ తాజా ఉదాహరణ. గాయనీ గాయకుల గొంతుల్ని పునః సృష్టిస్తున్నారు. పాటలు పాడించుకొంటున్నారు. ఆర్.ఆర్ పనులు కూడా ఏఐ చక్కబెడుతోంది. ఇప్పుడు డబ్బింగ్‌లు కూడా చెప్పిస్తున్నారు.
సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కంగువా’. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 7 భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ సూర్య గొంతే వినిపించనుంది. అయితే అది నిజంగా సూర్య గొంతు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో సృష్టించిన వాయిస్. అచ్చం సూర్య మాట్లాడుతున్నట్టే ఉంటుంది. అదే మ్యాజిక్కు. ఓ హీరో తన డబ్బింగ్ ని ఏఐతో కానిచ్చేయడం చిత్రసీమలో ఇదే తొలిసారి. మున్ముందు ఏఐ నుంచి ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సివస్తుందో..?
శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య టైటిల్ కార్డ్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశార్ట. త్వరలోనే దానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు. అక్టోబరు 10న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ రజనీకాంత్ ‘వేట్టయాన్’ వల్ల వాయిదా పడింది. ఇప్పుడు నవంబరు 14న రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది చిత్రబృందం. 2డీ, త్రీడీ వెర్షన్లలో ఈ సినిమా రానుంది. ఐమాక్స్ వెర్షన్ లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ అందులో నిజం లేదని చిత్రబృందం స్పష్టం చేసింది.