సూర్య తొలి తెలుగు సినిమా దాదాపుగా ఖరారైనట్టే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం కథా చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా దొంగతనం నేపథ్యంలో సాగుతుందని సమాచారం. మనీ హీస్ట్ అనే ఓ వెబ్ సిరీస్ పూర్తిగా బ్యాంకు దొంగతనం బ్యాక్ డ్రాప్ లో తీశారు. ఇప్పుడు అలాంటి కథే…. వెంకీ అట్లూరి రాసుకొన్నాడని తెలుస్తోంది.
మరోవైపు ఇది మల్టీస్టారర్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. మరో తమిళ హీరో ఈ సినిమాలో నటించే అవకాశాలు ఉన్నాయి. అదెవరు? అనేది ఆసక్తికరం. వెంకీ అట్లూరి ప్రస్తుతం రెండో హీరో కోసం అన్వేషిస్తున్నాడట. ధనుష్, దుల్కర్ సల్మాన్లలో ఒకరిని ఎంచుకోవొచ్చని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరితోనూ వెంకీ అట్లూరి పని చేశాడు. కాబట్టి… వాళ్లని సంప్రదించడం, ఒప్పించడం పెద్ద కష్టమైన విషయాలేం కావు. అయితే ఓ హీరోగా సూర్య ఉన్నప్పుడు, మరో కీలకమైన పాత్ర కోసం తెలుగు హీరోని తీసుకొంటే బాగుంటుందని నిర్మాత నాగవంశీ ఆలోచన. మొత్తానికి ఈ విషయంపై తర్జన భర్జనలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ విషయం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు సూర్య కోసం చందూ మొండేటి కూడా ఓ కథ రాసుకొన్నారు. వీరిద్దరి కాంబో కూడా ఖాయమే అనే వార్తలు వినిపిస్తున్నాయి. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. వివరాలు త్వరలో తెలుస్తాయి.