సినిమా హీరోలు కాస్త ఇమేజ్ వచ్చాకో, సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే ముందో – రాజకీయాల వైపు చూడడం ఆనవాయితీగా మారింది. తమిళ నాట ఈ సంస్కృతి మరింత ఎక్కువ. రజనీకాంత్, విజయ్…పొలిటికల్ ఎంట్రీ గురించి అక్కడ ఎప్పుడూ ఎడతెగని చర్చ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు నటుడు సూర్యకి కూడా రాజకీయాలపై ఆసక్తి ఉందని, ఆయన కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉందని తమిళ నాట చెప్పుకుంటూ ఉంటారు. సూర్య కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నారు. తమిళనాట విపత్తులు ఎప్పుడు సంభవించినా తన వంతు సాయం అందిస్తున్నారు.
ఇప్పుడు తమిళనాట రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సందర్భంగా ‘రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు.. అసలు వచ్చే ఉద్దేశ్యం ఉందా? లేదా?’ అంటూ ప్రశ్నల పరంపరను ఎదుర్కోవాల్సివస్తోంది. ఈ విషయమై సూర్య క్లారిటీ ఇచ్చాడు. ”నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదు. నేనేం చేసినా మనసుకు నచ్చిందే చేస్తాను. నేను చేసే సామాజిక కార్యక్రమాలు కేవలం సేవాతత్పరతతో చేస్తున్నవే. వాటికి రాజకీయాలు అంటగట్టకండి” అంటూ క్లారిటీ ఇచ్చేశాడు.