సూర్య, కార్తి… ఎలాంటి కాంట్రవర్సీ లేని హీరోలు వీళ్లు. వివాదాలకు దూరంగా ఉంటారు. వీళ్లపై గాసిప్పులూ తక్కువే. అయితే ఇటీవల సూర్య ముంబై షిఫ్ట్ అయిపోయాడు. తన భార్య జ్యోతిక, పిల్లలతో అక్కడే ఉంటున్నాడు. దాంతో సూర్యపై కొత్త గాసిప్పు పుట్టుకొచ్చింది. సూర్యది ఉమ్మడి కుటుంబం. అందరూ కలిసే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ ఉమ్మడి కుటుంబంలో తగాదాలు వచ్చాయని, ఆస్తి పంపకాలు జరిగాయని, అందుకే సూర్య ముంబై వెళ్లిపోయాడన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై సూర్య క్లారిటీ ఇచ్చాడు.
‘కంగువ’ ప్రమోషన్లలో భాగంగా సూర్య ముంబై మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ముంబై షిఫ్ట్ అవ్వడానికి గల కారణం పంచుకొన్నాడు. ”జ్యోతిక ముంబైలో ఉండేది. ముంబైతో తనకు 18 ఏళ్ల అనుబంధం. నాకోసం చెన్నై వచ్చేసింది. 27 ఏళ్ల పాటు చెన్నైలోనే ఉంది. నా కోసం చాలా త్యాగం చేసింది. ఇప్పుడు తనకోసం, పిల్లల కోసం నేను ముంబై వచ్చాను” అని స్పష్టం చేశాడు. దాంతో… ఆస్తి పంపకాలు, కుటుంబ కలహాలపై సూర్య ఓ స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్టైంది. సూర్య – కార్తిల అనుబంధం ఇప్పటికీ బలంగానే ఉంది. ఇటీవల కార్తి హీరోగా ‘సత్యం సుందరం’ చిత్రం విడుదలైంది. దీనికి సూర్యనే నిర్మాత. ‘కంగువ’లో కార్తి ఓ గెస్ట్ రోల్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవలూ, ఆస్తి తగాదాలూ ఉంటే.. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? సూర్య, కార్తిలు కలసి ఓ సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. అందుకు సంబంధించిన కథ కూడా దాదాపుగా సిద్ధమైందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా మొదలైతే, ఈ గాసిప్పులన్నింటికీ ఒకేసారి పుల్ స్టాప్ పెట్టినట్టు అవుతుంది.