మహానటి సావిత్రి సినిమాని మార్కెటింగ్ చేసుకోవడానికి అశ్వనీదత్ తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. నాగ అశ్విన్ దర్శకత్వం సావిత్రి జీవిత కథని మహానటి పేరుతో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. దాదాపుగా స్ర్కిప్టు పనులన్నీ పూర్తయిపోయాయి. కీర్తి సురేష్, సమంతలకు ప్రధాన పాత్రలు దక్కాయి. ఇప్పుడు మిగిలిన కాస్టింగ్ కోసం వేటలో ఉన్నాడు దత్. సావిత్రి అంటే… తమిళనాట కూడా పాపులరే! అందుకే ఈ సినిమాని అక్కడ కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్, సమంత తమిళ నాట తెలిసిన మొహాలే. అయితే… మరింత మంది తమిళ నటీనటుల్ని ఈసినిమా కోసం తీసుకోవాలన్నది దత్ ఆలోచన. సావిత్రి కథ అంటే శివాజీ గణేషన్ గురించీ చెప్పాల్సిందే. ఆ పాత్రలో తమిళ నటుడైతే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకోసం సూర్యని సంప్రదించింది చిత్రబృందం. ఈ కథ గురించీ, అందులో శివాజీ గణేశన్ పాత్ర గురించి క్షుణ్ణంగా తెలుసుకొన్న సూర్య తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టాడని సమాచారం.
సావిత్రి కథ ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాల్సివస్తే…. శివాజీగణేశన్ని నెగిటీవ్‌గా చూపించాల్సివుంటుంది. తమిళనాట శివాజీ గణేషన్ ని నెగిటీవ్‌గా చూపిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుంది. ఆ పాత్ర చేసిన సూర్యకీ ఆ భారం అనుభవించక తప్పదు. అందుకే సూర్య డైలామాలో ఉన్నట్టు చెబుతున్నారు. సూర్య చెప్పిన మార్పలు గనుక నాగ్ అశ్విన్ చేయగలిగితే.. అప్పుడు ఆ పాత్రలో కనిపించడానికి సూర్యకు ఎలాంటి అభ్యంతరాలూ లేకపోవొచ్చు. మరి నాగ అశ్విన్ అందుకు ఒప్పుకొంటాడా అనేది ఆసక్తిగా మారింది. మలయాళ నటుడు ఫృథ్వీరాజ్కీ ఈ సినిమాలో కీలక పాత్ర దక్కే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వారం పది రోజుల్లో వీటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.