తెలుగులో మాస్ హీరో సినిమా వస్తోందంటే ఆ హడావుడే వేరుగా ఉంటుంది. తెల్లవారుఝామున ఆటలతో హంగామా మొదలైపోతుంది. ఈమధ్య అర్థరాత్రి షోలకూ అనుమతులు వస్తున్నాయి కాబట్టే, ముందు రోజే పండగ షురూ అవుతుంది. దేవర సమయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా. అర్థరాత్రి ఆటలతోనే దేవర దూకుడు మొదలైపోయింది. దీపావళి సినిమాలకూ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇప్పుడు సూర్య సినిమా ‘కంగువ’ విడుదల కాబోతోంది. ఈనెల 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సూర్య సినిమాకూ తెల్లవారుఝూమున 4 గంటలకే షోలు పడబోతున్నాయి. ఓ డబ్బింగ్ సినిమాకు ఇలాంటి హడావుడి చూడడం ఇదే తొలిసారి. రజనీకాంత్, విజయ్ సినిమాలకు సైతం తెల్లవారుఝామున షో పడలేదు. కానీ సూర్య సినిమా ఈ రేర్ ఫీట్ సాధించబోతోంది.
అన్నింటికంటే ముఖ్యమైన సంగతి ఏమిటంటే – తమిళనాట బెనిఫిట్ షోలకు అనుమతి లేదు. అంటే తమిళంలో కంటే, తెలుగులోనే ‘కంగువా’ ని ముందుగా చూడొచ్చన్నమాట. సూర్య ఫ్యాన్స్ తమిళనాట నుంచి తెలుగు సీమకు వచ్చి `కంగువా`ని వీక్షించే ఛాన్సులున్నాయి. తెలుగు స్టార్ హీరోల సినిమాలకు ఉదయం ఆటలకే ఎగబడే జనం.. సూర్య సినిమాకే అదే స్థాయిలో వెళ్తారా? అనేదే పెద్ద ప్రశ్న. సూర్యకు ఇక్కడ అభిమానులు ఉన్నారు. ఆ విషయంలో డౌటు లేదు. కానీ తెల్లవారు ఝూమునే సినిమాకు వెళ్లే స్థాయిలో సూర్య ఇమేజ్ ఉందా? అనేది చూడాలి. ఓరకంగా సూర్య ఇమేజ్ కు ఇది పరీక్ష అనే చెప్పాలి. ఒకవేళ.. సూర్య సినిమాకు కూడా ఉదయం ఆటలకు మంచి రెస్పాన్స్ వస్తే – తమిళ హీరోల చిత్రాలకు ఇక నుంచి ఉదయం ఆటలు ఎక్స్పర్ట్ చేయొచ్చు. తమిళనాట కూడా బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని చిత్రసీమ గట్టిగా కోరుతోంది. కానీ అక్కడ స్టాలిన్ ప్రభుత్వం అందుకు సముఖంగా లేదు.