సూర్య…
అతని కథలు డిఫరెంట్‌గా ఉంటాయి. పాత్ర కోసం ఎంత కష్టమైనా చేస్తాడు. సినిమా హిట్టయినా – ఫ్లాప్ అయినా, కాసులు కురిపించుకొన్నా, తొలి రోజే డబ్బాలు వెనక్కి వెళ్లిపోయినా సూర్య చేసిన శ్రమ, ఆ పాత్ర కోసం పడిన తాపత్రయం ఇవన్నీ తెరపై కనిపిస్తూనే ఉంటాయి. హీరోగా ఫెయిల్ అయినా, నటుడిగా మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అందుకే సూర్య సినిమా అంటే సినీ అభిమానులకు అంత నమ్మకం. ఈ సారి సింగం 3 (తెలుగులో యముడు 3) విడుదలకు సిద్ధమైంది. ఈనెల 9న సూర్య ని వెండితెరపై చూసేయొచ్చు. ఈ సందర్భంగా తెలుగు 360తో సూర్య చేసిన చిట్ చాట్ ఇది!
* హాయ్ సూర్య..
– హాయ్..
* చాలా రోజుల నుంచీ ఈ సినిమా కోసం మమ్మల్ని వెయిటింగ్లో పెట్టేశారు…?
– అవును.. మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో.. ఈ సినిమా కోసం నేను కూడా అంతకు మించి ఆసక్తితో ఎదురుచూస్తున్నా. ఎట్టకేలకు నిరీక్షణ ఫలించింది. సంతోషంగా ఉంది.
* ఈ ఆలస్యానికి కారణమేంటి?
– రకరకాల రీజన్స్ ఉన్నాయి. తెలుగు, తమిళంలో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయాలనుకొన్నాం. జల్లి కట్టు ఇష్యూ వల్ల కొన్ని రోజులు వాయిదా వేయాల్సివచ్చింది.
* జల్లికట్టు సమయంలో మీరు చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కేవలం మీ సినిమా ప్రచారానికే మీరు అలాంటి కామెంట్లు చేశారన్న విమర్శలు వినిపించాయి..
– సినిమా ప్రచారం కోసం నోటి కొచ్చినట్టు కామెంట్లు చేసే తత్వం కాదు నాది. మనసులో ఏం ఉందో అదే చెప్పా. నో మొహంతో కామెంట్లు చేసి, మరో మొహం వేసుకొని తిరగలేను కదా? నా వ్యాఖ్యల్ని తప్పుబట్టినవాళ్ల గురించో, దానికి పెడర్థాలు తీసిన వాళ్ల గురించో నేను మాట్లాడలేను.
* సినిమా ఆలస్యమైంది.. ఆ ప్రభావం వసూళ్లపై పడుతోందంటారా?
– దీపావళి పండక్కి సినిమాని విడుదల చేద్దామనుకొన్నాం. పండగ సీజన్లో వస్తే చాలా బాగుండేది. ఇప్పటి వసూళ్లతో పోలిస్తే 20 శాతం మార్పు కనిపించేది. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ఇదీ మంచి టైమే.
* సింగం 1, సింగం 2లతో పోలిస్తే ఈ సినిమాలో కొత్తగా ఏముంటుంది?
– సింగం 1 మైనస్సుల్ని 2తో సరిదిద్దుకొన్నాం. ఆ రెండు సినిమాల్లో ఉన్న ప్లస్ పాయింట్స్‌ని మరింత ఎలివేట్ చేసే సినిమా ఇది. పార్ట్ 1 పల్లెటూరి నేపథ్యంలో సాగుతుంది. పార్ట్ 2లో హీరో పట్నానికి వస్తాడు. ఈసారి.. విదేశాల్లో అడుగుపెడతాడు. అక్కడ ఇండియన్ పోలీస్ పవర్ ఎలా చూపించాడన్నదే ఈ సినిమాలో కీలకమైన విషయం. పోలీస్ పవర్ చూపించే సీన్లన్నీ మాస్‌కి బాగా నచ్చుతాయి.
* ఈ సిరీస్ ఇక ముందూ కొనసాగిస్తారా?
– చేయాలనే ఉంది. ఓకే దర్శకుడితో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం అరుదైన విషయం. మలయాళంలో మోహన్‌లాల్ ఇలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలూ చేశారు. ఆ తరవాత ఆ అవకాశం నాకే వచ్చింది. జేమ్స్‌బాండ్ సిరీస్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా చూడాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అంత స్ట్రాంగ్‌గా, ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. తనకు ఎదురయ్యే సవాళ్లు, అందులోంచి బయటపడ్డ విధానం కొత్త కొత్తగా అనిపిస్తుంటుంది. సింగం సిరీస్‌నీ అలా మార్చుకొనే వీలుంది.
* మీరెక్కువగా రియలిస్టిక్ సినిమాలు చేస్తుంటారు కదా? దాంతో పోలిస్తే సింగం సిరీస్ కాస్త భిన్నంగా కనిపిస్తుంటుంది. ఈ రెండింటికీ మీరెలాంటి తేడాలు గమనించారు?
– ఇది కూడా రియలిస్టిక్ ఎప్రోచ్ ఉన్న సినిమానే. సినిమాలోలా బయట పోలీసులు ఫైట్స్ చేయకపోవొచ్చు. కానీ వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు అంతే కష్టంగా ఉంటాయి. పోలీసులు తమ లైఫ్‌నీ కెరీర్‌ని అడ్డం పెట్టి సాహసాలు చేస్తుంటారు. అవే ఈసినిమాలో కాస్త డ్రమెటిక్‌గా చూపించాం. సింగం, సింగం 2 సినిమాల్ని పోలీస్ అకాడమిలో ప్రదర్శిస్తుంటారు. పోలీస్ అంటే ఇలా ఉండాలి అని చూపిస్తుంటారు. అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది?
* దర్శకుడు హరిలో మీరు మెచ్చే క్వాలిటీస్ ఏమున్నాయి?
– హరి ఎలాంటి హీరోనైనా డీల్ చేయగలడు. ఫాస్ట్‌గా ఎగ్రసీవ్‌గా ఉంటాడు. తన స్క్రీన్ ప్లే టెక్నిక్ నాకు బాగా నచ్చుతుంది. హరి పోలీస్ కావాలని అనుకొన్నాడు. కానీ దర్శకుడయ్యాడు. పోలీస్ అయితే తానేం చేయగలను అనుకొన్నాడో అదంతా తెరపై నాతో చేయించి చూసుకొంటున్నాడేమో..?
* తెలుగులో నేరుగా ఓ సినిమా చేస్తారని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నాం.. అదెప్పుడు?
– తెలుగులో సినిమా చేయమంటున్నారు. నాకూ చేయాలనే ఉంది. చాలామంది దర్శకులతో మాట్లాడా. కథ సెట్ అయి… అంతా ఓకే అనుకొన్న తరవాత కూడా చివరి క్షణాల్లో ఆగిపోతోంది. అందుకే తెలుగు సినిమాల గురించి నేను మాట్లాడను. అది ఎప్పుడైతే సినిమా సెట్స్‌పైకి వెళ్తుందో అప్పుడు చెబుతా.