‘కంగువా’.. ఈ సినిమా గురించి నిన్నా మొన్నటి వరకూ పెద్దగా డిస్కర్షన్ జరగలేదు. కానీ… మెల్లమెల్లగా ‘కంగువా’ ఊహించని హైప్ తెచ్చుకొంది. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శివ దర్శకుడు. జ్ఞానవేల్ రాజా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందంచారు. నవంబరు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. దాదాపుగా రెండేళ్లు ఈ సినిమా సెట్స్‌పైనే ఉంది. మధ్యమధ్యలో ‘కంగువా’కు సంబంధించిన పోస్టర్లు బయటకు వస్తున్నా, ఈ సినిమాని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ టీజర్, ట్రైలర్‌తో ఒక్కసారిగా చర్చ మొదలైంది. దానికి తోడు సూర్య ప్రమోషన్లను మొదలెట్టేశాడు. బాలీవుడ్ లో తిరుగుతున్నాడు. హైదరాబాద్ లోనూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. బాలయ్య ‘అన్ స్టాపబుల్ షో’కి వెళ్లి వచ్చాడు. మరో 20 రోజుల్లో ‘కంగువా’ విడుదల కాబోతోంది. ఈలోగా.. వీలైనంత ఎక్కువ ప్రమోషన్లు జరపాలని టీమ్ భావిస్తోంది.
హైదరాబాద్ లో నిర్వహించిన ‘కంగువా’ ప్రెస్ మీట్ కు అభిమానుల నుంచి ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. సూర్యని చూడ్డానికి అభిమానులు ఎగబడ్డారు. ఏఎంబీ మాల్ బయట దాదాపు 2 వేల మంది ఫ్యాన్స్ సూర్య కోసం ఎదురు చూశారు. మరో రెండు వేల మందితో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. ఓ దశలో వాళ్లని కంట్రోల్ చేయడం ఎవరి వల్లా కాలేదు. సాధారణంగా తెలుగు స్టార్స్ వచ్చినప్పుడు ఇంత హంగామా చూసే అవకాశం దక్కుతుంది. ఓ తమిళ హీరోకి, హైదరాబాద్ లో ఇంత క్రేజ్ ఊహించలేనిదే.
మార్కెట్ పరంగానూ ‘కంగువా’ క్రేజ్ సంపాదించుకొంది. మైత్రీ మూవీస్ సంస్థ తెలుగు విడుదలలో భాగం పంచుకోవడానికి ముందుకు వచ్చింది. ఉదయం 4 గంటల ఆటతోనే ప్రీమియర్లు మొదలయ్యే అవకాశం ఉంది. తమిళ నాట భారీ బడ్జెట్ బడ్జెట్ తో రూపొందిన సినిమా ఇది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. పైగా నిర్మాత జ్ఞానవేల్ కూడా ఈ సినిమాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. రూ.2వేల కోట్లు సాధించే సినిమా అని ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. అంత కాకపోయినా, సినిమా గనుక హిట్ అయితే రూ.1000 కోట్ల మైలు రాయి చేరడం సాధ్యమే. తమిళ సినిమా ఎప్పుడూ చూడని అంకె ఇది. రజనీ, కమల్, విజయ్లకే సాధ్యం కాలేదు. మరి ఈ ఫీట్ సూర్య సాధిస్తాడేమో చూడాలి.