సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ అంటేనే ఓ సంచలనం. ప్రపంచంలో కోట్ల మందికి చేరువైన ఈ వెబ్ సైట్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఎవరూ ఊహించని చరిత్ర సృష్టించింది.
అదేమిటంటే, మొన్న సోమవారం నాడు ఒకే రోజు 100 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఫేస్ బుక్ ఉపయోగించారు. ఫేస్ బుక్ చరిత్రలో ఇదే తొలిసారి. ఫేస్ బుక్ ను ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. అయితే వారంతా ప్రతి రోజూ ఎకౌంట్ ఓపెన్ చేసి చూసుకోరు. రెండు మూడు రోజులకు ఓసారి ఫేస్ బుక్ లోకి వచ్చే వారే ఎక్కువ. కాబట్టి రెగ్యులర్ గా ఫేస్ బుక్ సైట్లోకి వచ్చే వారు వంద కోట్లకు లోపే ఉంటారు.
మొన్న సోమవారం మాత్రం ఒకేరోజు వంద కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఫేస్ బుక్ లోకి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. అంటే అంత మంది తమ తమ ఎకౌంట్ ను ఉపయోగించారన్న మాట. రానురానూ ఫేస్ బుక్ లోకి వెళ్లకపోతే తోచని స్థితికి కొత్త తరం వచ్చేస్తుందనడానికి ఇదీ ఒక ఉదాహరణే అంటున్నారు. మొత్తానికి ఫేస్ బుక్ సంచలనాలకు మారుపేరుగా మారింది.