మహేష్ బాబుతో సినిమాని గుట్టుచప్పుడు కాకుండా చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు రాజమౌళి. కాంబో సెట్ అయ్యిన విషయం, సినిమా మొదలైన సంగతి, షూటింగ్ అప్ డేట్ ఇలా… ఒక్క విషయం కూడా బయటపెట్టలేదు. టైటిల్ ఏమిటి, కాస్టింగ్ ఎవరు? అనే విషయాలు కూడా ఏమాత్రం చెప్పలేదు. సోషల్ మీడియాలో లీకేజీలు తప్ప అభిమానులకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ లేదు. ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నా, ఈ సినిమాకు సంబధించిన విషయాలేమైనా రాజమౌళి బయట పెడతాడని ఆశ పడుతున్నా – అలాంటివేం జరగడం లేదు. ఫ్యాన్స్ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చే,సుకొంటూ వెళ్లిపోతున్నాడు జక్కన్న.
అయితే… ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సర్ప్రైజ్ రాబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్, ఆ తాలుకూ ఫుటేజీతో ఓ గ్లింప్స్ లాంటిది ఎడిట్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఇందులో లుక్స్ ఏమీ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. సినిమా కాన్సెప్ట్ ని కొత్తగా చూపించే వీడియో అట. ఓ వెర్షన్ కట్ చేశాక, ఆర్.ఆర్తో రెడీ చేసి చూసుకొన్నాక, అన్ని విధాలా సంతృప్తి చెందితే అప్పుడు విడుదల చేస్తారు. లేదంటే మరో వీడియో కట్ చేస్తారు. మే 31 కృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఈ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉంది. మే 31 అంటే చాలా సమయం ఉంది. ఈలోగా ఎన్ని వెర్షన్లు రెడీ చేస్తారో? ఒకవేళ గ్లింప్స్ అనుకొన్నదానికంటే ముందే వచ్చేస్తే.. మే 31 వరకూ కూడా ఆగకపోవొచ్చు. బెటర్ మెంట్ కావాలంటే మాత్రం డిలే అవుతుంది. ఒక్కటి మాత్రం స్పష్టం.. మే 31న గానీ, అంతకంటే ముందే కానీ, మహేష్ సినిమా అప్ డేట్ మాత్రం ఖాయం.