సర్వేలన్నీ కాకి లెక్కలే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ పోసుకోలు కబుర్లే. ఏ రాజకీయ పార్టీకి తాము సన్నిహితమే.. ఆ పార్టీకి అనుకూలంగా సర్వేలు.. ఎగ్జిట్స్ పోల్‌ను ప్రజల్లోకి వరలడానికే తమ మీడియా సంస్థలు.. సంస్థల సర్వేలను వాడుకుంటున్నట్లుగా మరోసారి తేట తెల్లమయింది. జనం నాడిని పట్టుకోవడంలో విఫలమయ్యామంటూ ..ఆయా సర్వే సంస్థలు.. మీడియా చానళ్లు సమర్థించుకోవచ్చు కానీ..మరోసారి వారికి సర్వేలు ఎగ్జిట్ పోల్స్ .. చెప్పే అర్హతను కోల్పోయారు.
బెంగాల్లో బీజేపీ గెలుస్తుందన్న ఓ ఫీలింగ్ కల్పించడానికి బీజేపీ అనుకూల మీడియా చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. తృణమూల్ గెలుస్తుంది కానీ నెక్ టు నెక్ పోరు ఉంటుందని.. మోడీ … పెరిగిన గడ్డంతో ఠాగూర్ అవతారంలో బెంగాల్ మొత్తం కవరయ్యేలా సభలు నిర్వహిస్తే.. సీన్ మారిపోతుందన్నట్లుగా సర్వేలు ప్రకటించాయి. చివరికి ఎగ్జిట్ పోల్స్‌లోనూ అదే పరిస్థితి. ఏ విధంగా చూసినా… తృణమూల్‌కు అత్యధికంగా 170 .. అత్యల్పంగా 128 సీట్లు వస్తాయని సర్వే సంస్థలు అంచనావేశాయి. ఎడ్జ్ తృణమూల్‌కే ఉందని చెప్పినా.. బీజేపీకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాయి. బీజేపీ అధికారిక చానల్ లాంటి రిపబ్లిక్ అయితే.. బీజేపీ గెలుస్తుందని ప్రకటించాయి. అన్నీ… గాలి కబుర్లేనని పలితాల ద్వాలా తేలిపోయింది. బెంగాల్లో మమతా బెనర్జీ వైపు ప్రజలు ఏకపక్షంగా ఉన్నారన్న విషయాన్ని చెప్పలేకపోయారు.
తమిళనాడులో అన్ని సంస్థలు డీఎంకే విజయాన్ని అంచనా వేశాయి. కానీ అన్నాడీఎంకే ఏ స్థాయిలో పోరాటం ఇస్తుందో అంచనా వేయలేకపోయాయి. సాధారణంగా తమిళనాడులో ఒక సారిగెలిచిన పార్టీ … రెండో సారి ఓడిపోతుంది. అయితే అన్నాడీఎంకే గతంలో రెండు సార్లు గెలిచింది. ఇప్పటికి పదేళ్లు అధికారంలో ఉంది. అందుకే ఈ సారి అన్నాడీఎంకే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవదన్న అంచనా ఉంది. అదే సమయంలో జయలలిత లేదు.. అటు వైపు కరుణానిధి కూడా లేరు. కానీ ఆయన వారసుడు స్టాలిన్ బలంగా ఉన్నారు. పైగా లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే దున్నేసింది. ఈ కారణంగా ఆయనే గెలుస్తారని అనుకున్నారు. కానీ.. అన్నాడీఎంకే గట్టి పోటీ ఇచ్చింది. సరైన నేత లేకపోయినా… డీఎంకేకు ఏకపక్ష విజయం దక్కకుండా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని సర్వేలు ఎక్కడా చెప్పలేదు. నలభై, యాభై ఎమ్మెల్యే సీట్లు అన్నాడీఎంకే కూటమికి వస్తే గొప్ప అన్నారు.. కానీ తొంభై వరకూ.. అన్నాడీఎంకే కూటమి గెల్చుకుంటోంది.
ఇక అసోంలోనూ.. బీజేపీ గెలుస్తుందని సర్వేలు తేల్చాయి. అయితే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీనే గెలుస్తుందని సహజంగా అంచనా వేశారు. కానీ కాంగ్రెస్ కూటమి ఎంత ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కేరళలోనూ అంతే. కొన్ని సంస్థలు.. కాంగ్రెస్ కూటమి దారుణ పరాజయం పాలవుతుందని చెప్పుకొచ్చారు కానీ.. కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. బీజేపీకి ఎలాంటి చాన్స్ లేదని తేలిపోయింది.
సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్నింటికి .. ఆయా సంస్థలు విలువ కట్టి మరీ పరువు పోగొట్టుకుంటున్నాయని.. తాజా పరిణామాలతో వెల్లడైంది. ఇక నుంచి ఎగ్జిట్ పోల్స్ గురించి ఎవరూ పట్టించుకోకపోడం మంచిదన్న విషయం తాజా పరిణామాలతో వెల్లడయింది.