ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1.48 కోట్ల కుటుంబాల ఆర్ధిక, సామాజిక స్థితిగతులని తెలుసుకొనేందుకు ఈనెల 8వ తేదీ నుంచి నెలరోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించబోతోంది. దానిని ఆ రోజున ముఖ్యమంత్రి కుటుంబం నుంచే ప్రారంభిస్తారు. రెవెన్యూ మరియు ఇతర ప్రభుత్వోద్యోగులు ఈ సర్వేలో పాలుపంచుకొంటారు. వారు ఇంటింటికీ వెళ్లి ప్రజల వివరాలు సేకరిస్తారు. ఈ సర్వేలని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం 13 జిల్లాలకి ఐ.ఏ.ఎస్.అధికారులని నోడల్ అధికారులుగా నియమించింది.
వారి సర్వే నివేదికల ఆధారంగా ప్రభుత్వం సంక్షేమ పధకాలకి ప్రణాళికలు రచించుకొంటుంది. తిరుపతి మహానాడు సమావేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ సర్వే నివేదిక ఆధారంగా అగ్రవర్ణాలలో పేదలకి కూడా రిజర్వేషన్లు, సంక్షేమ పధకాలను వర్తింపజేస్తామని తెలిపారు. కనుక ఈ సర్వేలో అందరూ తమ వివరాలను ఇవ్వడం చాలా అవసరమనే చెప్పవచ్చు.