తెలంగాణలో విపక్షాలన్నీ కూటమి కట్టాలనే కుతూహలంతో ఉన్నాయి! కానీ, సీట్ల సర్దుబాటు దగ్గరకి వచ్చేసరికే అసలు చర్చంతా మొదలౌతోంది. అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసొచ్చిన తరువాత టి. కాంగ్రెస్ వైఖరిలో కొంత మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం 90 స్థానాల్లోనైనా సొంతంగా పోటీ చేసి తీరాలని కాస్త బలంగానే నిర్ణయించుకున్నట్టు సమాచారం. అంటే, మిగిలిన ఆ కొద్ది సీట్లను ఇతర పార్టీలకు పంచాలనే ఉద్దేశంతో టి. కాంగ్రెస్ ఉంది. కానీ, ఇతర పార్టీలు కూడా తమ పట్టు నిలుపుకోవడం కోసం ఎవరి నంబర్ తో వారు సిద్ధంగా ఉన్నారు. దీంతో సీట్ల పంపకం వరకూ వచ్చేసరికి మహా కూటమిలో కొంత తర్జనభర్జన తప్పదనే అనిపిస్తోంది.
అయితే, ఈ సందిగ్ధతకు తెర దించే ఓ మధ్యే మార్గాన్ని కూటమి పక్షాలు ప్రతిపాదించాయని సమాచారం! మహా కూటమి ఆధ్వర్యంలో ఒక సర్వే చేయించాలనీ, ఆ తరువాత సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక చేయాలనే ఉమ్మడి కార్యాచరణకు పార్టీలు సిద్ధమౌతున్నట్టు సమాచారం. ఈ సర్వే ఆధారంగానే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే లెక్క తేల్చొచ్చు అనేది ఆలోచనగా తెలుస్తోంది. ఇంతకీ ఈ సర్వే ఎలా అంటే… కూటమిలో ఉన్న అన్ని పార్టీలూ, రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లోనూ ఎవరెవర్ని నిలబెడతారో, వారి పేర్లను ఇస్తారన్నమాట. అంటే, ఒక నియోజక వర్గంలో కాంగ్రెస్ తోపాటు, టీడీపీ, టీజేయస్, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతిపాదిత అభ్యర్థులందరిపైనా క్షేత్రస్థాయిలో సర్వే చేయిస్తారట! ఆ సర్వేలో ఏ అభ్యర్థికి అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలుతుందో… వారికే టిక్కెట్ ఇవ్వాలనే నిర్ణయానికి రావొచ్చనీ, దీంతో కూటమిలోని పార్టీ మధ్య టిక్కెట్ల పంపకం సులువు అవుతుందనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇంతకీ ఈ సర్వే ఎవరు చేస్తారంటే… కూటమిలోని అన్ని పార్టీల సమ్మతంతో ఒక సంస్థకు బాధ్యతను అప్పగిస్తారట! ఓరకంగా ఇది కూటమిలోని పార్టీల అభ్యర్థుల మధ్య అప్రకటిత ముందస్తు పోటీలా కనిపిస్తోంది! అయితే, ఇలా సర్వే ద్వారా ఎంపిక సాధ్యమా అనే అనుమానాలు కూడా వారి మధ్యనే వినిపిస్తున్నాయి. ఇంకోటి, ఇలా అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కూడా కాలయాపనతో కూడిన అంశం. అభ్యర్థుల ప్రతిపాదనల్ని ఆయా పార్టీలు ఇవ్వాలి, వారిపై సర్వే జరగాలి, ఫలితాలు రావాలి, అభ్యర్థుల ప్రకటన జరగాలి! ఈలోగా క్షేత్రస్థాయిలో పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, ఒక నియోజక వర్గంలో ఏ పార్టీ పోటీ చేస్తుందో వీలైనంత త్వరగా తేల్చకపోతే… ఎవ్వరూ క్రియాశీలంగా పనిచేసే అవకాశం ఉండదు కదా!