ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న శివకుమార్ రెడ్డి గెలుస్తారని.. లగడపాటి రాజగోపాల్ ప్రకటించగానే… అందరిలోనూ ఒకటే కుతుహలం ప్రారంభమయింది. ఆ నియోజకవర్గ పరిస్థితులేమిటన్నదానిపై.. ఆసక్తి ప్రారంభమయింది. నారాయణపేట నియోజకవర్గం.. తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన ఎల్లారెడ్డి విజయం సాధించారు. 2014లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన రాజేందర్ రెడ్డి విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున.. కంభం శివకుమార్ రెడ్డి పోటీ చేశారు. కేవలం రెండు వేల రెండు వందల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ.. కొడంగల్‌తో పాటు.. నారాయణ పేట నియోజకవర్గాన్ని కూడా గెలుచుకుంది. అయితే.. ఆ తర్వాత రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఆర్ఎస్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న శివకుమార్ రెడ్డి… చివరికి వరకూ… తనకే కేసీఆర్ టిక్కెట్ ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ.. ఇచ్చే అవకాశం లేదని తేలిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీపై పట్టు కోసం.. చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. డీకే అరుణ, జైపాల్ రెడ్డి వీరిలో ముఖ్యులు. వీరు తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించేందుకు పోటీ పడ్డారు. జైపాల్ రెడ్డి.. నాగం జనార్ధన్ రెడ్డి సహా.. కొంత మందిని ప్రత్యేకంగా పార్టీలో చేర్పించారు. ఈ చేరికల్ని డీకే అరుణ తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా ఆగలేదు. అదే సమయంలో డీకే అరుణ నారాయణపేట నుంచి టీఆర్ఎస్ నేతగా ఉన్న శివకుమార్ రెడ్డిని కాంగ్రెస్ లో చేర్పించారు. కానీ టిక్కెట్లు దగ్గరకు వచ్చే సరికి… హైకమాండ్ వద్ద డీకే అరుణ, జైపాల్ రెడ్డి తమ అనుచరులకే ఇప్పించేందుకు పోటీ పడ్డారు. శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని డీకే అరుణ పట్టుబట్టారు. జైపాల్ రెడ్డి మాత్రం.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వామనగారి కృష్ణకే ఇవ్వాలన్నారు. చివరికి జైపాల్ రెడ్డి మాట నెగ్గింది. శివకుమార్ రెడ్డికి అవకాశం దక్కలేదు.
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున బీఫాం తీసుకున్న శివకుమార్ రెడ్డి పోటీలోకి దిగారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం.. ఈ సారి అటు టీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్.. రెండు పార్టీల్లోనూ టిక్కెట్ నిరాకరించడంతో…ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఉంది. పైగా.. నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే పని చేసుకుంటున్నారు. ప్రతి మండలంలో సొంత అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వామనగారి కృష్ణ బలహీన అభ్యర్థిగా కనిపిస్తూ ఉండటంతో.. పోటీ ప్రధానంగా రాజేందర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి మధ్యే నడుస్తోంది. సానుభూతిని మించిన అస్త్రం రాజకీయాల్లో ఉండదు కాబట్టి.. ప్రస్తుతం.. ఆ సానుభూతి శివకుమార్ రెడ్డికి పనికొస్తోంది. అదే సమయంలో గెలుస్తారంటూ.. లగడపాటి ప్రకటించడంతో… తటస్థుల ఓట్లు.. శివకుమార్ రెడ్డికే పడటం ఖాయమయ్యే పరిస్థితి ఉంది. నారాయణ పేట విషయంలో… లగడపాటి అంచనా తప్పే అవకాశం దాదాపుగా లేనట్లేనని చెప్పుకోవచ్చు.