ఈ నెల 16న తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. తమిళనాడులో మళ్ళీ జయలలితే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. కేరళలో ఇన్స్టిట్యూట్ ఫర్ మానిటరింగ్ ఎకనామిక్ గ్రోత్ అనే సంస్థ చేసిన సర్వేలో ఈసారి వామపక్ష కూటమి పూర్తి మెజారిటీతో అధికారంలోకి అవకాశాలున్నాయని తేల్చి చెప్పింది. అంటే ఈసారి కూడా కేరళ ప్రజలు తమ ఆనవాయితీని పాటించబోతున్నట్లు స్పష్టమవుతోంది. కేరళలో గత మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ నేతృత్వంలోని యు.డి.ఎఫ్.కూటమి, వామపక్షాల నేతృత్వంలోని ఎల్.డి.ఎఫ్.కూటమిల మద్యే ఐదేళ్ళకోసారి అధికార మార్పిడి జరుగుతోంది. ప్రస్తుతం యు.డి.ఎఫ్.కూటమి అధికారంలో ఉంది కనుక ప్రజలు దానిని దించి దాని స్థానంలో ఎల్.డి.ఎఫ్.కూటమికి అధికారం కట్టబెట్టబోతున్నారని సర్వే నివేదిక సూచిస్తోంది.
కేరళ శాసనసభలో మొత్తం 140 స్థానాలుండగా వాటిలో సుమారు 83-90 స్థానాలను ఎల్.డి.ఎఫ్.కూటమి, యు.డి.ఎఫ్.కూటమి 50-57 స్థానాలు గెలుచుకొనే అవకాశాలున్నాయని సర్వేలో తేల్చి చెప్పింది. ఈ ఎన్నికలలో భాజపాకి ఒక్క సీటు కూడా లభించే అవకాశం లేదని కూడా చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 60 వేల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా ఈ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
ఇది కాంగ్రెస్ పార్టీ ఊహించినదే గానీ నిరాశ చెందకుండా ఉండలేదు. ఈ ఎన్నికలతో దక్షిణాది రాష్ట్రాలలో అడుగుపెట్టాలని కలలు గన్న భాజపాకి తీవ్ర నిరాశ తప్పదు. అయితే దానితో ఏ ప్రాంతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించినప్పుడే దాని ఓటమి ఖరారయిపోయింది. కనుక మళ్ళీ కర్నాటక, ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నికలు వచ్చేవరకు భాజపాకి ఎదురుచూపులు తప్పవు.