తెలంగాణలో ఎవరు గెలవబోతున్నారు..? ఏపీలో పవన్ కల్యాణ్ ప్రభావం ఎంత..? ఈ రెండు ఇప్పుడు… తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మిలియన్ డాలర్ల క్వశ్చన్స్. ఉత్తరాది నుంచి అనేక ఓపీనియన్ పోల్స్.. సర్వేలు.. దూసుకొస్తున్నాయి. వాటిని ఎంటర్ టైనింగ్ గానే ప్రజలుచూస్తున్నారు తప్ప నమ్మలేకపోతున్నారు. ఇక పార్టీలు.. మీడియా సంస్థలు రెగ్యులర్‌గా ఇలాంటి సర్వేలు చేయించుకుంటూనే ఉంటాయి. కానీ బయటపెట్టవు. సర్వేలను బట్టి పార్టీలన్నీ… తదుపరి కార్యాచరణ సిద్ధం చేసుకుంటాయి. మీడియా సంస్థలు మాత్రం తమకు ఓ అవగాహన కోసం చేసుకుంటాయి. చేయించుకున్న సర్వేలు.. అతి తక్కువగానే ప్రకటిస్తూంటారు. అలా … తెలుగులో ఓ ప్రముఖ న్యూస్ చానల్ సర్వే చేయించుకుంది. కేవలం తమకు క్లారిటీ కోసమే సర్వే చేయించుకుంది కానీ… ప్రకటించడానికి కాదు. అ సర్వే వివరాలు… తెలుగు 360కి లభించాయి.
ఈ సర్వేలో ఆశ్చర్యకర ఫలితాలు వచ్చినట్లు ఆ చానల్ వర్గాలు తెలుగు 360కి చెప్పాయి. తెలంగాణలో వంద సీట్లు సాధిస్తామని.. .తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ దగ్గర్నుంచి… ప్రతి ఒక్క గులాబీ నేత… తొడకొట్టి మరీ చెబుతున్నారు. అది వారి కాన్ఫిడెన్స్. ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి ఆ మాత్రం ఆత్మవిశ్వాసం చూపించాలి. లేకపోతే.. మొత్తానికే తేడా వస్తుంది. అసలు ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారంటే.. పెరిగిపోతున్న అసంతృప్తిని.. వీలైనంతగా కవర్ చేసుకుని… బయటపడిపోవడానికే. ఆ విషయం తెలుగు చానల్ నిర్వహించిన సర్వేలో స్పష్టంగా బయటపడింది. కేసీఆర్ అత్యంత తెలివిగా.. ముందస్తు ఎన్నికల నిర్ణయం తీసుకున్నారని స్పష్టమయింది.
తెలంగాణ రాష్ట్ర సమితికి 70 సీట్ల వరకూ వస్తాయని చానల్ నిర్వహించుకున్న సర్వేలో వెల్లడయింది. వ్యూహాత్మకంగా ముందస్తుకు వెళ్లడం.. ఎన్నికలు ఆలస్యం కాకుండా చూసుకోవడంలో.. ఆయన సక్సెస్ అవడం బాగా కలసి వచ్చింది. ఈ విషయంలో పూర్తిగా క్రెడిట్ పూర్తిగా కేసీఆర్ కే దక్కుతుంది. కేసీఆర్ పై ఉన్న పాజిటివ్ వేవ్ తో… సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించారని సర్వేలో వెల్లడయింది. మహాకూటమికి 40 సీట్ల వరకూ వస్తాయని అంచనా. కాంగ్రెస్, టీడీపీలతో పాటు.. టీజేఎఎస్, సీపీఐలలో బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్లో… మహాకూటమి అభ్యర్థులు మంచి విజయాలు నమోదు చేస్తారు. నిజానికి ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం మేలో జరిగితే… కాంగ్రెస్‌కు పూర్తి ఫేవర్‌గా ఫలితాలు ఉండేవి. కానీ… ఎన్నికలు ముందుగా జరగడమే… కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారబోతోందని సర్వేలో స్పష్టమయింది.
ఇక ఏపీలో… పవన్ కల్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనా ఆ ప్రముఖ చానల్ విస్తృతమైన సర్వే చేసింది. అందులో… పవన్ కల్యాణ్ తన బలాన్నంతా.. కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే చూపించగలరని ఉభయగోదావరి జిల్లాల్లో ఆరు శాతం ఓట్లు జనసేనకు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఆ రెండు జిల్లాలో ఒకటి, రెండు సీట్లు జనసేన అభ్యర్థులు గెలవొచ్చు. మిగతా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒకటి నుంచి రెండు శాతానికి అటూ ఇటుగా జనసేనకు ఓట్లు వస్తాయని తేలింది. అంటే.. తనకు వచ్చే ఒకటి, రెండు శాతం ఓట్లతో.. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రెండు ముఖ్య పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్ని మాత్రం తారుమారు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నారని సర్వే చెబుతోంది. ఈ వివరాలన్నీ.. అంతర్గత అవగాహన కోసం ఆ చానల్ నిర్వహించుకుంది. ఆ వివరాలు తెలుగు360కి లభించాయి. ఈ సర్వే వివరాలను ఆ చానల్ ప్రకటించకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది.