అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి 34, 000 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్నపుడు, రైతులతో సహా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, కోర్టులు, గ్రీన్ ట్రిబ్యునల్ ,అనేకమంది ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దాని వలన ఆ భూములను, వ్యవసాయాన్నే నమ్ముకొన్న అక్కడి రైతుల, వారి కుటుంబాల జీవితాలు పూర్తిగా చిద్రం అవుతాయని వాదించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అభ్యంతరం తెలిపారు. అయినా ప్రభుత్వం ముందుకే సాగి భూసమీకరణ కార్యక్రమం పూర్తిచేసింది.
రైతులు ఇష్టపూర్వకంగానో లేక ఒత్తిళ్ళ కారణంగా అయిష్టంగానో ప్రభుత్వానికి తమ భూములు అప్పగించేశారు. మళ్ళీ ఆ భూములలో కొత్తగా పంటలు వేసుకొనేందుకు అధికారులు అనుమతించడం లేదని సమాచారం. ఆ కారణంగా వ్యవసాయం తప్ప మరో జీవనాధారం లేని అక్కడి రైతుల ఆర్ధిక, సామాజిక పరిస్థితి ఇప్పుడు ఎలాగ ఉంటుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సి.ఆర్.డి.ఏ. సంస్థ రాజధాని పరిధిలోకి వచ్చే మొత్తం 951 గ్రామాలలో సామాజిక, ఆర్థిక సర్వేను నిర్వహించాలని నిర్ణయించింది. ఆర్.వి.కన్సల్టెన్సీ సంస్థకు ఆ బాధ్యతని అప్పగించింది. ఆ సంస్థ నేటి నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు సర్వే నిర్వహించి నివేదిక తయారు చేస్తుంది. దాని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తగిన పధకాలు, కార్యక్రమాలు చేపడుతుంది.
ఇన్నాళ్ళకయినా రాజధాని ప్రాంతంలో రైతుల ఆర్ధిక, సామాజిక పరిస్థితులను తెలుసుకొనేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహించాలనుకోవడం మంచి ఆలోచనే. రాజధాని భూముల సేకరణ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం, “రైతులను నిలువునా ముంచేసి వారి భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తోందని” ప్రతిపక్షాల నుంచి నేటికీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. బహుశః ఆ విమర్శలకు దీటుగా జవాబు చెప్పేందుకే ప్రభుత్వం ఇప్పుడు రైతుల ఆర్ధిక, సామాజిక పరిస్థితులపై సర్వే నిర్వహించడానికి సిద్దం అవుతోందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల కారణంగా ప్రభుత్వంపై ఏర్పడిన ఆ అపవాదును తొలగించుకొనేందుకు ఒక సర్వే నిర్వహించి, ‘రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అందరూ ఎప్పటి లాగే చాలా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని, భూములు ఇచ్చినా వారి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు పెద్దగా మారలేదని, అందరూ తమ భూములలో రాజధాని నిర్మింపబడాలని గట్టిగా కోరుకొంటున్నారని’ తెలియజేస్తూ ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక ఏర్పాటు చేసుకొనేందుకే ఈ సర్వే నిర్వహిస్తోందేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సర్వే పూర్తయ్యి నివేదిక చేతికి వస్తే ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం అవుతుంది.