తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారిందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ ఒకరిని పీసీసీ అధ్యక్షుడిగాను మరో ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగాను నియమించాలని అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్ష పదవి తీసుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపకపోతే తెలంగాణలో మాత్రం పోటీ ఎక్కువగా ఉంది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు తెలంగాణ పీసీసీ పదవి కోసం పోటీ పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడమే కాకుండా పార్టీని పటిష్ట పరిచేందుకు అధిష్టానం సత్తా ఉన్న నాయకుడి ఎంపికలో పడింది. ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి దూకుడు మీద ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ రేసులో ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు మరో ఇద్దరు, ముగ్గురు నాయకులు కూడా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఈ దశలో రహస్య సర్వే ద్వారా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే ఈ సర్వే పని ప్రారంభమైనట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో సీనియారిటీతో పాటు అందర్నీ కలుపుకొని వెళ్లే నాయకత్వ లక్షణాలు ఉన్నవారు, కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకొని సర్వే చేస్తున్నట్లు సమాచారం. క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో పార్టీ అధ్యక్షుడి ఎంపికతో పాటు కాంగ్రెస్ పార్టీ ఏ అంశంలో ప్రజలకు దూరం అయింది అనే విషయాలను కూడా స్థానిక ప్రజల నుంచి రాపడుతున్నట్టు సమాచారం. శాసనసభ ఎన్నికలకు మూడు సంవత్సరాల సమయం ఉండడంతో ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లి పని చేసే నాయకుడి ఎంపిక జరగాలని, గ్రూపు వివాదాలకు ఇక ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్నది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. అధిష్టానం నిర్వహిస్తున్న సర్వే ఆధారంగానే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు.