వరల్డ్ కప్ లో సూపర్ క్యాచ్ అనగానే.. ఇది వరకు 1983లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్ గుర్తొస్తుంది. వీవ్ రిచర్డ్ గాల్లో బంతి లేపితే.. బౌండరీ లైన్ వైపు వెనక్కి పరుగెడుతూ కపిల్ అద్భుతమైన క్యాచ్ అందుకొన్నాడు. ఆ క్యాచ్ మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పింది. భారత్ ను తొలిసారి విశ్వ విజేతగా నిలిపింది. ఇప్పుడు అలాంటి అద్భుతమైన క్యాచ్ సూర్య కుమార్ యాదవ్ అందుకొన్నాడు. దీన్ని క్యాచ్ ఆఫ్ ది ఆల్ వరల్డ్ కప్స్ అని అభివర్ణించినా తప్పు లేదేమో?
చివరి ఓవర్ లో సౌతాఫ్రికా గెలవాలంటే 16 పరుగులు చేయాలి. ఎదురుగా మిల్లర్ లాంటి ప్రమాదకరమైన బ్యాటర్ ఉన్నాడు. మిల్లర్ తలచుకొంటే మూడే మూడు బంతుల్లో మ్యాచ్ ముగించగలడు. అందుకే భారత అభిమానుల్లో టెన్షన్ ఎక్కువైపోయింది. దానికి తగ్గట్టుగా పాండ్యా వేసిన తొలి బంతికి లాంగ్ ఆఫ్ మీదుగా గాల్లో లేపాడు మిల్లర్. ఆ బంతి స్పీడు చూస్తే సిక్సరేమో అనిపించింది. అయితే బౌండరీ లైన్ దగ్గరున్న సూర్య కుమార్ యాదవ్ దాన్ని అద్భుతంగా ఒడిసిపట్టుకొన్నాడు. బౌండరీ లైన్ దగ్గర ఏమాత్రం కంట్రోల్ తప్పినా, సిక్స్ అయ్యేదే. ఒకవేళ తొలి బంతికి సిక్స్ కొడితే మ్యాచ్ మొత్తం… సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోయేది. కానీ సూర్య ఆ అవకాశం ఇవ్వలేదు. మిల్లర్ వికెట్ దక్కడంతో… భారత్ గెలుపు లాంఛనమైపోయింది. సంబరాలు అప్పుడే షురూ అయిపోయాయి. బ్యాటింగ్ లో తక్కువ స్కోరుకే వెనుదిరిగిన సూర్య, ఈ కీలకమైన క్యాచ్ అందుకొని మ్యాచ్ స్వభావాన్నే మార్చేశాడు. అందుకే అనేది క్యాచెస్ విన్ ద మ్యాచెస్ అని.