తెలుగులో స్ట్రయిట్‌గా ఓ సినిమాలో నటించాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు సూర్య. కొంతమంది దర్శకులు కథలు కూడా చెప్పారు. అయితే.. అవేం సెట్టవ్వలేదు. అయితే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని అప్పట్లో ఓ టాక్ వచ్చింది. అది నిజమేనట. ఈ విషయాన్ని సూర్య అంగీకరించాడు కూడా. ”త్రివిక్రమ్‌గారితో ఓ సినిమా ఉంటుంది. ఆయన రెండు మూడు కథలు వినిపించారు. అందులో ఒకటి ఫైనల్ చేయాలి.. త్వరలోనే మా సినిమా ఎప్పుడన్నది చెబుతా” అన్నాడు సూర్య.
త్రివిక్రమ్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించాలా, లేదంటే తెలుగుకే పరిమితం చేయాలా అనే విషయంలో ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సూర్య తెలిపాడు. ”తెలుగు, తమిళ ప్రేక్షకుల మధ్య పెద్దగా తేడా ఏం లేదు. మంచి ఎమోషన్ ఎక్కడున్నా ఒకేలా పండుతుంది. రెండు చోట్లా ప్రేక్షకుల అభిరుచుల్లో పెద్దగా మార్పు ఉండదు. అయితే త్రివిక్రమ్ సినిమా ముందు తెలుగులో చేసి, ఆ తరవాత డబ్ చేయాలా.. లేదంటే ఒకేసారి రెండు భాషల్లోనూ తెరకెక్కించాలా అనే విషయాల్లో నిర్ణయం తీసుకోలేద”న్నాడు.