ముద్ద పప్పు ఆవకాయ్ లాంటి వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంది మెగా డాటర్ నిహారిక. తనలో కావల్సినంత ప్రతిభ ఉంది. కానీ.. సినిమాల్లో మాత్రం అది బయటకు రావడం లేదు. చేసిన రెండు సినిమాలూ బాక్సాఫీసు దగ్గర పల్టీకొట్టాయి. ముచ్చటగా మూడో ప్రయత్నం `సూర్య కాంతం`తో చేసింది. `ముద్ద పప్పు ఆవకాయ్` ని తెరకెక్కించిన ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకుడు. వరుణ్ తేజ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చి 29న విడుదల అవుతోంది. ఈరోజు టీజర్ బయటకు వచ్చింది.
సూర్యకాంతంగా నిహారిక అల్లరిని చూపించడానికి ఈ టీజర్‌ని వాడుకున్నారు. సూర్యకాంతం పేరు పాతదే అయినా.. పాత్రీకరణ మాత్రం మోడ్రన్‌గా కనిపిస్తుంది. ప్రేమించిన అబ్బాయితో, స్నేహితులతో ఎంత తుంటరిగా, కేర్లెస్గా ఉంటుందో… `నువ్వు పెళ్లిచేసుకోకపోతే చచ్చిపోతాను` అని బెదిరించిన అమ్మతోనూ అంతే ఇదిగా సెటైర్లు వేస్తోంది. క్యారెక్టరైజేషన్ వరకూ… ఈ సినిమా చూడబుల్గానే ఉన్నట్టుంది. ఇదే టెంపో సినిమా మొత్తం కంటిన్యూ చేస్తే… నిహారికకు తొలి హిట్ పడినట్టే.