సూరేకాంతం.. ఈ పేరు చెబితే చాలు, తెలుగు సినిమా కోడళ్లు హడలిపోతారు. సగటు భర్తలు ఝడుసుకుంటారు. ఆమె నిష్టూరాలు, శాపనార్థాలూ డీటీఎస్ లేని రోజుల్లోనూ రీ సౌండ్ చేసేవి. గయ్యాళి పాత్రల పేటెంట్ ఇంకా ఆమె చేతుల్లోనే ఉంది. అలాంటి అత్త, అలాంటి నటన, అలాంటి పాత్రలు.. నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.
అయితే ఈ గయ్యాళితనమంతా సెట్ వరకే. బయట ఆమె శాంత మూర్తి. మృధు స్వభావి. ఆమె మంచితనం గురించీ, గొప్ప మనసు గురించీ కథలు కథలుగా చెబుతుంటారు అప్పటివాళ్లు. అందుకు ఓ మచ్చుతునక లాంటి ఫ్లాష్ బ్యాక్ ఇది.
ప్రత్యాగాత్మ దర్శకత్వంలో ఓ సినిమా జరుగుతోంది. ఏఎన్నార్ హీరో. సూర్యకాంతానికి ఎప్పటిలా మాంఛి గయ్యాళి పాత్ర దొరికింది. ఓ సన్నివేశంలో ఇంటికొచ్చిన చిత్తూరు నాగయ్యని చడామడా తిట్టిపరేయాలి. సీను పేపరు చేతికి అందుకున్న సూర్యకాంతం.. డైలాగులన్నీ కంఠతా పట్టేసింది. దర్శకుడు ‘షాట్ రెడీ’ అన్నాడు. సూర్యకాంతం వీరలెవిల్లో విజృంభించేసింది. సీను పేపర్లో లేని డైలాగులు (అంటే తిట్లు, శాపనార్థాలు అన్నమాట) కూడా విసిరేసింది. ఆ ధాటికి చిత్తూరు నాయగ్యలాంటి నటుడే బిత్తరబోయి చూస్తుండిపోయాడు. దర్శకుడు ‘కట్’ చెప్పేశారు.
ఎప్పుడైతే ‘కట్’ అనే మాట వినిపించిందో – సూర్యకాంతం వెళ్లి చిత్తూరు నాగయ్య కాళ్లమీద పడిపోయింది. ‘నన్ను క్షమించండి నాన్నగారూ.. పాపిష్టిదాన్ని మిమ్మల్ని నానా మాటలు అనాల్సివచ్చింది’ అంటూ బోరుమంది. చిత్తూరు నాగయ్యని సూర్యకాంతం ప్రేమగా `నాన్నగారు` అని పిలుస్తుంది లెండి.
వెంటనే చిత్తూరు నాగయ్య కూడా తేరుకుని ‘నువ్వు నన్నెక్కడ తిట్టావ్? నా పాత్రని తిట్టావంతే. అయినా నువ్వో మహానటివి. నీలాంటి నటి దొరకడం చిత్రసీమకు ఓ అదృష్టం’ అంటూ కితాబు ఇచ్చేశారు. అదీ… సూర్యకాంతం అంటే!