నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన రెండు స్థానాల్లో ఒకటి సూర్యాపేట. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు పడిన.. జగదీష్ రెడ్డి.. ఈ నియోజకవర్గం నుంచి కేవలం రెండు వేల ఓట్ల తేడాతో .. ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సంకినేని వెంకటేశ్వరరావుపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సీటు మారుతారని ప్రచారం జరిగినా.. సూర్యాపేట టిక్కెట్‌ను కేసీఆర్ జగదీష్ రెడ్డికే ప్రకటించారు. అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే జగదీష్ రెడ్డి… ప్రచారం ప్రారంభించారు. అధికార బలం అండగా.. ఆయన నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు.
సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోను టికెట్ ఎవరికి వస్తుందోనని ఆతృతతో ఎదురుచూస్తున్నారు. సీనియర్ కాంగ్రెస్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ తో పాటు పార్టీలో చేరిన పటేల్ రమేష్ రెడ్డి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ దామోదర్ రెడ్డి కి ఉంది. గత ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టిడిపి నుంచి పోటీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి లు పోటీ చేశారు. వీరిద్దరూ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఏఐసీసీ స్థాయిలో విస్తృత పరిచయాలు ఉన్న దామోదర్ రెడ్డి టికెట్ పై ధీమాతో ఉన్నారు. పటేల్ రమేష్ రెడ్డి తన ఆశలన్నీ రేవంత్ రెడ్డి పైనే పెట్టుకున్నారు.
అయితే వ్యక్తిగతంగా నియోజకవర్గంలో పట్టు ఉండటంతో.. సంకినేని వెంకటేశ్వరరావు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జగదీష్ రెడ్డి పై స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. జిల్లాలో అంతగా కేడర్ లేని బిజెపికి మొదటినుంచి టిడిపి, వైసిపి పార్టీలో ఉన్న తన కార్యకర్తలు, అనుచరవర్గం తో బిజెపిని బలోపేతం చేశారు. బీజేపీ టిక్కెట్ ఆయనకే ఖరారు కావొచ్చు. పలుమార్లు కేంద్ర మంత్రులను సైతం సూర్యాపేటకు తీసుకొచ్చి సభలు నిర్వహించి బిజెపిలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రజలంతా తన వైపే ఉన్నారని ఈసారి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తానని అత్యంత పట్టుదలతో ఉన్నారు. బీజేపీ పార్టీ మైనస్ అయితే అవుతుంది కానీ.. ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా… గట్టి పోటీ ఇస్తారని అందరూ భావిస్తున్నారు.
ఏ విధంగా చూసినా.. సూర్యాపేటలో ఈ సారి త్రిముఖ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్, మహాకూటమి, బీజేపీ అభ్యర్థులు హోరాహోరీగా తలపడటం ఖాయమే. ప్రభుత్వ వ్యతిరేకత ఏ కొంచెం కనిపించినా.. జగదీష్ రెడ్డికి గడ్డు కాలమేనని.. మెజార్టీ ప్రజల అభిప్రాయం.