హిందీ సినిమాలకు ఎక్కడైనా మార్కెట్ ఉంటుంది. షారుఖ్, సల్మాన్, అమీర్, హృతిక్ సినిమాలకే కాదు.. యంగ్ హీరోల సినిమాలకూ క్రేజే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా గురించి కూడా అంతటా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుశాంత్ చివరి సినిమా `దిల్ బెచారా` ఇప్పుడు ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈనెల 24న హాట్ స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ట్రైలర్ ఈరోజు విడుదల చేశారు.
`ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్` అనే ఓ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. కాన్సర్ తో బాధ పడుతున్న ఓ అమ్మాయిని, ఓ అబ్బాయి ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది కథ. ట్రైలర్లో చిన్న చిన్న మూమోంట్స్, సున్నితమైన భావోద్వేగాలూ, ఎమోషన్స్ ఇవన్నీ.. చక్కగా పలించాడు దర్శకుడు. ఇదో ఎమోషనల్ లవ్ స్టోరీ అనే సంగతి అర్థమవుతోంది. `గీతాంజలి` మూడ్ అక్కడక్కడా కనిపిస్తే… అది మన తప్పేం కాదు. ఓ అల్లరి అబ్బాయి, చావుకి దగ్గరవుతున్న అమ్మాయి – ఇంతకంటే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఎక్కడ దొరుకుతుంది. దానికి కాస్త ఎంటర్టైన్మెంట్ జోడించి ఈ సినిమాని తీశారు. రెహమాన్ పాటలు, ఇచ్చిన ఆర్.ఆర్.. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చెప్పిన డైలాగ్.. కచ్చితంగా అతని అభిమానులకు కంటతడి పెట్టిస్తుంది. `ఎప్పుడు పుడతామో, ఎప్పుడు పోతామో మనం నిర్ణయించలేం.. కానీ.. ఎలా బతకాలన్ని మనం నిర్ణయించుకోగలం` అనే మాటలు – చనిపోయేటప్పుడు కూడా సుశాంత్ గుర్తు పెట్టుకుంటే బాగుండేది. మొత్తానికి.. ఓ మంచి లవ్ స్టోరీ చూడబోతున్నాం అనే ఫీలింగ్ అయితే తెచ్చిందీ ట్రైలర్. మరి సినిమా ఉలా ఉంటుందో చూడాలి.