అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ నటించిన తాజా సినిమా ‘చిలసౌ’. ‘అందాల రాక్షసి’ ఫేమ్, హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకి నాగార్జున ఒక నిర్మాత. సినిమా షూటింగ్ మొదలైనప్పుడూ, మధ్యలోనూ, పూర్తయినప్పుడూ ప్రాజెక్ట్‌లో నాగార్జున లేరు. సినిమా మొత్తం పూర్తయ్యాక, నాగచైతన్య చూసి బావుందని చెప్పడంతో నాగార్జున చూశారు. ఆయనకూ నచ్చడంతో సినిమాలో పార్టనర్‌గా చేరారు. అయితే… అక్కడితో మేటర్ క్లోజ్ కాలేదు. దర్శకుడు రాహుల్, హీరో సుశాంత్‌కి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. నాగార్జున సలహాల మేరకు కొన్ని సన్నివేశాలను రీషూట్లు చేసి, రీఎడిట్లు చేశారు. ఆగస్టు 3న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన సుశాంత్ ఈ సంగతి చెప్పారు.
సుశాంత్ మాట్లాడుతూ “చిన మావయ్య ముందు నుంచి సినిమాల విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోమనేవారు. కొంచెం కన్ఫ్యూజన్తో ఇతరుల సలహాలు తీసుకునేవాణ్ణి. ఈ సినిమా విషయంలో మాత్రం నేనే నిర్ణయం తీసుకున్నా. బయట నిర్మాతలతో చేయాలని ముందే డిసైడ్ అయ్యాను. అమ్మకు కథ కూడా తెలియదు. సినిమా పూర్తయ్యాక చైతూ, సమంతల రాహుల్ సినిమా చూపించడం, అక్కడి నుంచి మావయ్య దగ్గరకు వెళ్లడంతో అన్నపూర్ణ సంస్థ ద్వారా విడుదలవుతోంది. సినిమా చూసి మావయ్య కొన్ని సలహాలు ఇచ్చారు. మేం రీషూట్స్ చేశాం. దాంతో మరింత బాగా వచ్చింది” అన్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించే ప్రతి ప్రాజెక్ట్ (సినిమా) ఫైనల్ ప్రోడక్ట్ విషయంలో నాగార్జునదే ఫైనల్ డెసిషన్. చైతూ సినిమాలకూ సలహాలు ఇస్తుంటారు. అదే విధంగా మేనల్లుడి సినిమాకి ఇచ్చారన్నమాట. ఆగస్టు 3న విడుదలవుతోన్న సినిమాల్లో ‘చిలసౌ’కి మంచి బజ్ నెలకొంది. సుశాంత్ కూడా కాన్ఫిడెంట్‌గా వున్నాడు. రిజల్ట్ ఎలా వుంటుందో!