అక్కినేని హీరోగా అరంగేట్రం చేసిన సుశాంత్‌కి గట్టి దెబ్బలే తగిలాయి. ఒక్క `కరెంట్` ఒక్కటే కాస్త బెటర్ అనిపించింది. మాస్, కమర్షియల్ హీరోగా నిలదొక్కుకోవాలన్న ప్రయత్నంలో కొన్ని తప్పులు చేశాడు. వాటిని సరిదిద్దుకుంటూ… `చిలసౌ` సినిమాని రూపొందించాడు. ఈ సినిమాతో కొత్త సుశాంత్‌ని చూస్తారని నమ్మకంగా చెబుతున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా సుశాంత్‌తో చేసిన చిట్ చాట్ ఇది
చిలసౌ… ఈ పేరు వెనుక కథేంటి?
ఇది చాలా సున్నితమైన కథ. దానికి తగిన టైటిలే ఉండాలనుకున్నాం. స్క్రిప్టు అనుకున్నప్పుడు `చిరంజీవి అర్జున్` అనే పేరు పెట్టాం. అప్పటికి `అర్జున్ రెడ్డి` విడుదలైంది. ఆ ప్రభావం జనాలపై చాలా ఉంది. అర్జున్ అనగానే పవర్ఫుల్ క్యారెక్టర్ అనుకుంటారని భయం వేసింది. వెన్నెల కిషోర్ ఇచ్చిన సలహా మేరకు.. చిలసౌ అని టైటిల్ పెట్టాం.
యాక్షన్ సినిమాలు చేసిన మీరు.. తొలిసారి లవ్ స్టోరీని ఎంచుకున్నారు. ఈ మార్పుకి కారణం ఏమిటి?
ఇది ఇప్పుడొచ్చిన మార్పు కాదు. ఎప్పటి నుంచో కొత్త కథల గురించి అన్వేషిస్తున్నా. ఈ ప్రయాణంలో కొన్ని యాక్షన్ కథల్ని కూడా పక్కన పెట్టా. సుశాంత్ కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడన్న సంగతి తెలియాలంటే.. నా నుంచి ఆ తరహా సినిమా కనీసం ఒక్కటైనా రావాలి. అప్పుడే నన్ను నమ్మడం మొదలెడతారు. ఇది వరకు.. నా సినిమాల విషయంలో నా సొంత నిర్ణయాలు ఏం ఉండేవి కావు. చాలామందిపై ఆధార పడేవాడ్ని. చిలసౌ సినిమా మాత్రం పూర్తిగా నా నిర్ణయంపైనే జరిగింది. ఈ కథ వింటున్నప్పుడు గానీ, సినిమా చేస్తున్నప్పుడు గానీ ఎవ్వరినీ సంప్రదించలేదు. ఎవ్వరి సలహాలూ తీసుకోలేదు. ఆ విధంగా నాలో మార్పు మొదలైనట్టే.
మరి మావయ్య నాగార్జున ఏమన్నారు?
మావయ్య చెప్పే మాట కూడా అదే. తప్పో ఒప్పో నీ నిర్ణయం నీవే తీసుకో. ఇంకొకరి జడ్జిమెంట్‌పై ఆధారపడకు అని సలహా ఇచ్చారు. ఇప్పుడు నేను చేసింది కూడా అదే.
తొలిసారి బయటి నిర్మాణ సంస్థతో చేశారు కదా.. దానికి కారణమేంటి?
నా సినిమాలు నేనే తీసుకుంటాన్న ట్యాగ్ వద్దనిపించింది. అందుకే ఈసారికి మాత్రం బయటి నిర్మాతతో చేద్దామని డిసైడ్ అయ్యా. రాహుల్ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పాను. ఇద్దరు నిర్మాతలకు ఈ కథ చెప్పాం. వర్కవుట్ అవ్వలేదు. చివరికి.. ఓ నిర్మాత దొరికారు. అలా పట్టాలెక్కింది.
చివరికి మళ్లీ అన్నపూర్ణ సంస్థ చేతుల మీదుగానే విడుదల అవుతోంది కదా?
ఇదేదో నా సినిమా అని వాళ్లు ముందుకు రాలేదు. నిజంగా వాళ్లకు సినిమా నచ్చింది. సమంత, చైతూలకు ఈ కథ గురించి ముందే తెలుసు. సినిమా పూర్తయ్యాక ఫీడ్ బ్యాక్ కోసం వాళ్లకు చూపించాం అంతే. వాళ్లకు బాగా నచ్చింది. ఆ తరవాత మావయ్య చూశారు. మంచి సినిమాలు వచ్చినప్పుడు, వాటిని అన్నపూర్ణ బ్యానర్లో విడుదల చేయాలని చైతూ భావిస్తున్నాడు. సరిగ్గా అప్పుడే `చిలసౌ` చూశాడు. అలా… ఆ ప్రయత్నం మా సినిమాతోనే మొదలెట్టాడు,.
ఈ సినిమా చూశాక మావయ్య ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమిటి?
ఆయనకు బాగా నచ్చింది. `కొత్తగా కనిపిస్తున్నావు` అన్నారు. `ఇలాగే కంటిన్యూ చేయ్.. మంచి ఫలితాలు వస్తాయి` అన్నారు. అంతే కాదు.. అమ్మకు ఫోన్ చేసి ఈసినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. అదే.. గొప్ప సర్టిఫికెట్లా భావిస్తున్నాను.
చిలసౌ కథ గురించి రెండు ముక్కలు చెప్పమంటే..?
పెళ్లి చూపులు నుంచి ఈ కథ మొదలవుతుంది. 24 గంటల్లో జరిగే కథ. చాలా రియల్ గా ఉంటుంది. ఒక్క ఫ్రేమ్ కూడా సినిమాటిక్‌గా కనిపించదు. పెళ్లి కథ కదా అని ఫ్యామిలీ సాంగ్స్ లాంటివేం పెట్టలేదు. ఇది ఆ జోనర్ సినిమా కాదు. మన జీవితంలోనో, మన స్నేహితుల జీవితంలోనో ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా అనిపిస్తుంది.
అనుహసన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, జెపీ .. అన్నిపాత్రలూ మనసుకి చేరువ అవుతాయి. నేను కూడా మేకప్ వేసుకోలేదు. ఏ సినిమాలో షార్ట్స్ వేసుకుని కనిపించలేదు. ఈసినిమా మొత్తం అవే వేసుకున్నాను. ఏ సినిమాలో చేయని కొత్త కొత్త పనులు చాలా చేశా. ఈ సినిమాతో కొత్త చాప్టర్ మొదలవుతుందని నేను నమ్ముతున్నా.
రాహుల్‌కి దర్శకత్వం కొత్త కదా, ఎలా హ్యాండిల్ చేశాడు?
నేను దాదాపుగా కొత్త దర్శకులతోనే వర్క్ చేశాను. కాబట్టి ఆ టెన్షన్ రాలేదు. కథ బాగుంది… పైగా రాహుల్‌కి కథానాయకుడిగా అనుభవం ఉంది. అది బాగా పనికొచ్చింది. ఓ నటుడి నుంచి ఏం రాబట్టుకోవాలో అతనికి బాగా తెలుసు.
ఇప్పటి వరకూ చేయని జోనర్ కదా? కష్టమనిపించలేదా?
ఈ సినిమా కోసం కొన్ని వర్క్‌షాపులు చేశాం. అది బాగా పనికొచ్చింది. పక్కింటి అబ్బాయిలా కనిపించే పాత్ర ఇది. నేను బయట ఎలా ఉంటానో, ఈసినిమాలోనూ అలానే కనిపిస్తా. కాబట్టి… నాకేం కష్టం అనిపించలేదు.
తరవాత కూడా ఇలానే కొత్త ప్రయత్నాలు చేస్తారా?
తప్పకుండా. ఇక నుంచి నా నుంచి ఏ సినిమా వచ్చినా .. కొత్తగానే ఉంటుంది. కనీసం కొత్తగా ఇవ్వాలన్న ప్రయత్నం అయినా కనిపిస్తుంది. ఈమధ్య ఓ కథ విన్నా. అది కూడా కొత్త కథే. అదో థ్రిల్లర్. కానీ బోలెడంత కామెడీ ఉంటుంది. దర్శకుడు ఎవరు? ఎప్పుడు మొదలవుతుందన్నది త్వరలో చెబుతా.
గట్టిగా కొడతా.. అనే పోస్టర్‌పై మీరు కూడా సెటైర్ గట్టిగానే వేసినట్టున్నారు?
దాన్ని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. అది వైరల్ అయిపోయింది. అదేంటి? ఈ సినిమా చేస్తున్నావా అని నన్ను చాలా మంది అడిగారు.. నేను చేయని సినిమా చాలా పాపులర్ అయ్యింది. దాన్నే ప్రమోషనల్‌గా వాడుకున్నాం.
చూసినవాళ్లు కూడా బాగుందంటున్నారు.