కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల కాలం ఇది. కాన్సెప్ట్ బాగుంటే, స్టార్లు ఉన్నా లేకున్నా, బడ్జెట్లు పెట్టినా, పెట్టకపోయినా వర్కవుట్ అయిపోతోంది. ఇంత వరకూ మాస్, లవ్ స్టోరీలు చేసిన సుశాంత్ కూడా ఈమధ్య కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా రూపుదిద్దుకున్న సినిమా `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. ఇదో కొత్త తరహా కథ అనే సంగతి టైటిల్ లోనే చెప్పేశారు. టీజర్లు, ప్రచార చిత్రాలూ అలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ కథ టెంపో ఎలాంటిదో చెబుతూ ఓ పాటని విడుదల చేశారు.
”పద్మవ్యూహం లోనికి చొరబడి
బయటకు మరలే దారే లేదా?
గద్దల తాకిడి తట్టుకునిలబడి
నిర్దోషిత్వం రుజువే కాదా..?
పొద్దుట యుద్ధం పొడమే ఎరుగని
లోకం తెలియని గూడే విడువని
వాడే వీడే అభిమన్యుడు కాగా..” అంటూ సాగే ఈ గీతాన్ని… అరుణ్ వేమూరి రాశారు. కీరవాణి తనయుడు కాలభైరవ పాడారు. ప్రవీణ్ లక్కరాజు స్వరకర్త. ఈ పాటని ఈరోజు… వరుణ్‌తేజ్ విడుదల చేశారు.
ఈ సినిమా కాన్సెప్ట్ ని చెప్పే గీతం ఇది. మరి… సుశాంత్ ఎలాంటి పద్మవ్యూహంలో చిక్కుకున్నాడో.. అందులోంచి ఎలా బయటపడ్డాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. దర్శన్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.