ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియలో పాల్గొన్న వారిలో మాజీ కేంద్రమంత్రి సుషీల్ కుమార్ షిండే కూడా ఒకరు. కానీ రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రజల, పార్టీల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. తమ అధిష్టాన దేవత సోనియా గాంధీ రాష్ట్రాన్ని విభజించాలని ఫిక్స్ అయిపోయారు కనుకనే పార్టీలో షిండే, జైరామ్ వంటి సీనియర్లు అందరూ మరో ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని విభజించి చేతులు దులుపుకొన్నారు. ఆ తరువాత వారిలో జైరామ్, దిగ్విజయ్ సింగ్ వంటి ఒకరిద్దరు సీనియర్ నేతలు తప్ప మరెవరూ ఇంతవరకు తాము బలవంతంగా విడగొట్టిన రాష్ట్రం పరిస్థితి ఎలాగా ఉందో తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. కనీసం మొహం చూపించలేదు. రాష్ట్రం విడిపోయిన ఏడాదిన్నర తరువాత సుషీల్ కుమార్ షిండే అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు విజయవాడకి వచ్చేరు.
ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ కి ఎటువంటి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే విభజన బిల్లులో చాలా జాగ్రత్తలు తీసుకొన్నాము. కానీ వాటిలో చాలా వాటిని నేటికీ మోడీ ప్రభుత్వం అమలు చేయకపోవడం వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా మంజూరు చేయవలసి ఉంది. కానీ ఏడాదిన్నర గడిచినా ఇంత వరకు మంజూరు చేయకుండా మాయ మాటలు చెపుతూ ప్రజలను మభ్య పెడుతోంది. ఏపీకి న్యాయం జరిగేంత వరకు మేము పార్లమెంటులో పోరాడుతూనే ఉంటాము,” అని అన్నారు.
ఏ రాష్ట్రానికయినా ప్రత్యేక హోదా మంజూరు చెయ్యాలంటే దానికి చాలా ఇబ్బందులు, అవరోధాలు, అభ్యంతరాలు ఉన్న కారణంగానే కాంగ్రెస్ పార్టీ గత పదేళ్ళ పాటు అధికారంలో ఉన్నప్పటికీ ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చెయ్యలేదు. కానీ తమ పార్టీ మళ్ళీ ఎలాగూ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని ముందే పసిగట్టడం చేత ఆంద్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా మంజూరు చేస్తామని మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ చేత పార్లమెంటులో ప్రకటింపజేసి చేతులు దులుపుకొంది. ఆంద్రప్రదేశ్ పరిస్థితిపై కాంగ్రెస్ పార్టీకి నిజంగా అంత జాలి ఉండి ఉంటే సుష్మా స్వరాజ్ తదితరుల రాజీనామాల కోసం పట్టుబడుతూ పార్లమెంటును స్తంభింపజేసే బదులు రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలుచేయమని మోడీ ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి చేసి ఉండి ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించేవారు. కానీ ఆ పని చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు అందరూ మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వడంలో ఉన్న సమస్యల గురించి వారికి తెలుసు గనుకనే దాని కోసం గట్టిగా డిమాండ్ చేస్తూ మోడీ ప్రభుత్వం చెయ్యి మెలికపెడుతూ పైశాచికానందం పొందుతున్నారని చెప్పవచ్చును.