హైదరాబాద్: లలిత్ మోడికి సాయపడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ వ్యవహారాలశాఖమంత్రి సుష్మా స్వరాజ్ ఎదురుదాడికి దిగారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కుంభకోణంలో నిందితుడుగా ఉన్న కేంద్ర మాజీ సహాయమంత్రి సంతోష్ బాగ్రోడియాకు దౌత్య వీసా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడొకరు తనపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. ఆ నాయకుడి పేరును పార్లమెంట్లో వెల్లడిస్తానని ట్వీట్ చేశారు.
సుష్మా స్వరాజ్-లలిత్ మోడి వివాదంపై చర్చకు సిద్ధమని అధికారపక్షం చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ ససేమిరా అంటున్న సంగతి తెలిసిందే. సుష్మ రాజీనామా చేయాల్సిందేనని కాంగ్రెస్ పట్టుపడుతోంది. అయితే, తప్పును ఎత్తిచూపుతున్నందుకు ఎదుటివాళ్ళు చేసిన తప్పులు బయటపెడతానంటున్న సుష్మ వ్యవహారం చిన్నపిల్లలమాదిరిగా ఉందనిపిస్తోంది.
మరోవైపు సుష్మ ట్విట్టర్ పేజిలో ఆమె పేరు పక్కన ‘విదేశాంగమంత్రి’ అని ఉండే పదం ఇవాళ అదృశ్యమయింది. దీనిని ఆమె ఎందుకు తొలగించారో తెలియకుండా ఉంది. రాజీనామాకు ఆమె సిద్ధమైపోయారా అని ఊహాగానాలు సాగుతున్నాయి.