ఇటీవల పారిస్ జరిగిన పర్యావరణ మార్పులపై జరిగిన అంతర్జాతీయ సమావేశం వలన పర్యావరణంలో మార్పులు వచ్చినా రాకపోయినా ఆ సందర్భంగా భారత్-పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ రెండు మూడు నిమిషాలు మాట్లాడుకొన్న మాటల వలన భారత్-పాక్ దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇటీవల బ్యాంకాక్ లో ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరిగింది. ఆ తరువాత నిన్న భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ బయలుదేరి వెళ్ళారు. భారత్-పాక్ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా రద్దయిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లు మళ్ళీ మొదలవబోతున్నాయి. డిశంబర్ 24 నుండి జనవరి 5వరకు శ్రీలంకలో జరుగబోయే క్రికెట్ మ్యాచ్ లలో భారత్-పాక్ కూడా ఆడబోతున్నట్లు తాజా సమాచారం.
భారత్-పాక్ దేశాల మధ్య చర్చలు మళ్ళీ ప్రారంభం అయ్యేందుకు తన పర్యటన ఉపకరిస్తుందని భావిస్తున్నట్లు సుష్మా స్వరాజ్ అభిప్రాయం వ్యక్తం చేసారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ మరియు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ లతో ఆమె భేటీ అవుతారు. ఎటువంటి ముందస్తు షరతులు విధించకుండా భారత్ తో చర్చలకు సిద్దమని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రకటించడం కూడా ఇరు దేశాల మధ్య చర్చలకు సానుకూల వాతావరణం కల్పించిందని చెప్పవచ్చును. కానీ ఈ చర్చల వలన ఇరు దేశాల మధ్య శాశ్వితంగా శాంతి నెలకొంటుందనే భ్రమలో ఇరు దేశాలు లేవు. అమెరికా తదితర అగ్రరాజ్యాల ఒత్తిడి కూడా ఇరు దేశాలను చర్చలు మొదలుపెట్టేలా చేసి ఉండవచ్చును. ఈ చర్చలు వలన సమస్యలు పరిష్కారం కాకపోయినా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఘర్షణ వాతావరణం తగ్గే అవకాశం ఉంటుంది.