ప్రధాని మోదీ, అమిత్ షా దేశంలో ఎక్కడికి వెళ్లినా వారసత్వ రాజకీయాలపై ఆవేదన చెందుతారు. ఒక్క బీజేపీ తప్ప అన్ని పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని మనదేమైనా రాచరికమా అని ప్రశ్నిస్తూంటారు. మరి ఇంత ఆవేదన చెందుతున్న వారు… తమ పార్టీలో వారసత్వాన్ని నిషేధించారా అంటే.. ఇతర పార్టీల కన్నా మిన్నగా వారసులకు అవకాశం కల్పిస్తున్నారు. దివంగత నేత సుష్మస్వరాజ్ కూతుర్ని ఢిల్లీ రాజకీయాల్లో ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ బీజేపీ కార్యదర్శిగా పదవి ఇచ్చారు. విపరీతమైన పబ్లిసిటీ ప్రారంభించారు.
ఢిల్లీ బీజేపీకి ఆమెనే భవిష్యత్ అన్నట్లుగా కలరింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ఇమేజ్ మేకోవర్ కూడా ప్రారంభమయింది. ఢిల్లీలో ఓ గ్లామర్ ఉన్న నేత కొరత బీజేపీకి ఉంది. ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సుష్మస్వరాజ్ కుమార్తె అయితే ఆమె వారసత్వం నిలబెడుతుందని.. ఆమెకు చాన్సివ్వాలని అనుకున్నారు. ఆ ప్రకారం తెరపైకి తీసుకు వచ్చారు. ఆమె లాయర్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు రాజకీయంంగా తెరపైకి తెస్తున్నారు.
బీజేపీలో ప్రతి అగ్రనేత వారసుడు … రాజకీయాల్లో ఉన్నారు. అమిత్ షా కుమారుడు ఏకంగా బీసీసీఐని గుప్పిట్లో పెట్టుకున్నారు. రాజ్ నాథ్ సింగ్ నుంచి అమిత్ షా వరకూ వారసుల్ని తెరపైకి తీసుకు రాని నేత నెతలెవరూ లేరు . అయినా బీజేపీ నేతలు ఇతర పార్టీల వారిని విమర్శిస్తూ ఉంటారు. వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని… తామే వాటిని నిరోధిస్తామని చెబుతూ ఉంటారు. మరి బీజేపీ వారసత్వ రాజకీయాలు మంచివి.. ఇతరులు చేస్తే చెడ్డవా ?