ఓ అగ్ర హీరో చేతిలో 4 చిత్రాలు ఉండడం, నాలుగూ ఒకేసారి షూటింగ్ జరుపుకోవడం రికార్డే. ఆ రికార్డు.. ఇప్పుడు చిరంజీవి పేరుమీదుంది. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమా.. ఇవి నాలుగూ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఆ నాలుగు సినిమాలకూ చిరు ఈ నెలలో డేట్లు కేటాయించారు. అలా.. చిరు కెరీర్లో ఎప్పుడూ చూడని దృశ్యానికి ఈ డిసెంబరు వేదిక అయ్యింది.
నిజానికి చిరుకి ఇంత హర్రీ బర్రీగా సినిమాలు చేయాలని ఉండదు. సినిమా తరవాత సినిమా అనేది తన పాలసీ. దాదాపు అగ్ర హీరోలంతా అదే పాటించారు. అరవై ఏళ్లు దాటిన తరవాత.. కెరీర్ని ఇంత స్పీడుగా పరుగులు పెట్టించాలని అనుకోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అయితే ఈ స్పీడు వెనుక ఓ ప్రధాన కారణం ఉంది. ఆ కారణం పేరు సుస్మిత. చిరు కుమార్తె సుస్మిత ఇప్పుడు చిరుకి సంబంధించిన సమస్తమైన విషయాల్నీ చూసుకుంటున్నారు. ఆచార్య మినహాయిస్తే.. మిగిలిన మూడు ప్రాజెక్టులు సెట్ చేయడం వెనుక సుస్మిత హస్తం ఉంది. చిరు పారితోషికాలు డీల్ చేయడం దగ్గర్నుంచి, డేట్లు సర్దుబాటు చేయడం వరకూ అన్ని విషయాలనూ ఆమే దగ్గరుండి చూసుకుంటోందట. చిరు వయసు పెరుగుతోంది. మహా అయితే మరో రెండు మూడేళ్లు ఇంత స్పీడుగా సినిమాలు చేసే అవకాశం ఉంది. తరవాత ఎలాగూ… యేడాదికి ఒకటీ, అర అంటూ పరిమితం కావాల్సిందే. తప్పదు. అందుకే… ఓపిక ఉన్నప్పుడే చకచక సినిమాలు చేసేయ్యమని.. సుస్మిత సలహా ఇచ్చిందట. చిరు డైట్ కూడా తనే దగ్గరుండి చూసుకుంటోందట. అందుకే చిరు కూడా కుర్రాడిలా సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపించేస్తున్నారు.