చిరంజీవి తనయ సుస్మిత సినిమా పరిశ్రమలో స్థిరపడింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా పేరు తెచ్చుతుంది. చిరంజీవి రీఎంట్రీలో ప్రతి సినిమాకి సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్. చరణ్ రంగస్థలం సినిమాకి కూడా పని చేసింది. దీంతో పాటు నిర్మాణంలోనూ అడుగుపెట్టింది. గోల్డ్ బాక్స్ సంస్థ ఆమెదే. ఏవో కొన్ని చిన్న సినిమాలు చేసింది.
అయితే తండ్రి చిరంజీవితో సినిమా నిర్మించాలని సుస్మిత ఎప్పటినుంచో ముచ్చట పడుతోంది. ఒక సినిమాని దర్శకుడు పేరు లేకుండా ప్రకటించారు. అదే కళ్యాణ్ కృష్ణ సినిమా. కానీ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది. అసలు ఉంటుందా లేదో కూడా తెలీదు. అయితే ఇప్పుడు మెగాస్టార్ సుస్మిత ముచ్చట తీర్చేస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు చిరంజీవి. ఈ సినిమాకి సాహు గారపాటి సోలో నిర్మాణం అనుకున్నారు. కానీ ఇది సోలో వెంచర్ కాదు. నిర్మాణంలో సుస్మిత కూడా వున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. సుస్మిత గోల్డ్ బాక్స్, సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొత్తానికి కూతురు ముచ్చట తీర్చేశారు చిరు. సమ్మర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.