ఆంధ్రప్రదేశ్లో పాదయాత్రల సెంటిమెంట్ ఉంది! 2004 ఎన్నికలకు ముందు మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైయస్సార్ పాదయాత్ర చేశారు. ఆ తరువాత, ముఖ్యమంత్రి అయ్యారు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారు. ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యారు! ఇప్పుడు వైయస్ జగన్ కూడా మహా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారా.. అంటే, అవుననే అంటున్నాయి వైకాపా వర్గాలు. అయితే, ప్రస్తుతం పాదయాత్రపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. అధికారికంగా ఈ పాదయాత్ర గురించి ఎలాంటి సమాచారం బయటకి రాకపోయినా… ఈ సమయంలో చేస్తే ఎలా ఉంటుందన్న చర్చోపచర్చలు పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. విశేషం ఏంటంటే.. జగన్ పాదయాత్ర గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రస్థావించడం!
గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ద్వారా రైతుల సమస్యలను తెలుసుకున్నారనీ, అదే బాటలో జగన్ కూడా పాదయాత్ర చేస్తే తాము స్వాగతిస్తామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. రేణిగుంటలో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన జగన్ పాదయాత్ర ప్రస్థావన తెచ్చారు. తండ్రి బాటలోనే జగన్ పాదయాత్ర చేసి, రాష్ట్ర ప్రజల సమస్యలను తెలుసుకోవాలనీ, ప్రభుత్వ వైఫల్యాలపై గట్టి పోరాటం చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఇదే విషయమై వైకాపాలో చర్చ జరుగుతోందన్న కథనాలు వస్తున్న తరుణంలోనే డిగ్గీరాజా ఇలా మాట్లాడటం విశేషంగానే చెప్పుకోవాలి.
అయితే, పాదయాత్ర విషయమై జగన్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే, త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నారట! ఎలా అంటే… ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ సర్కారుకు కోర్టు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే జంప్ జిలానీలపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే తీర్పు ఆంధ్రాకి కూడా వర్తిస్తుందనీ, కాబట్టి కొన్ని శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు అనివార్యం కావొచ్చనే అంచనాలో వైకాపా ఉందని సమాచారం! అందుకే, ఫిరాయింపుల ఎమ్మెల్యేల విషయమై ఏదో ఒకటి తేలాక పాదయాత్ర చేస్తారని ఓ పార్టీలో అభిప్రాయం ఉంది.
అయితే, ఇప్పటికిప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఏమంత లాభం ఉండదనీ, సార్వత్రికర ఎన్నికలకు ఆర్నెల్లు ముందు యాత్ర చేస్తే పార్టీకి మంచి ఊపు తెచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం పార్టీలో కొంతమంది వ్యక్తం చేస్తున్నారట! మొత్తానికి జగన్కు పాదయాత్ర ఆలోచన అయితే ఉందని, కాకపోతే ఎప్పుడు చేస్తారనేది మాత్రం స్పష్టత రావడానికి మరింత సమయం పట్టొచ్చని అంటున్నారు!