‘గుంటూరు కారం’ వచ్చి, వెళ్లిపోయి ఆరు నెలలు గడిచింది. అయితే ఇప్పటి వరకూ త్రివిక్రమ్ తరువాతి సినిమా ఏమిటన్న విషయంలో స్పష్టత లేదు. అసలు త్రివిక్రమ్ సినిమాలు తీసే మూడ్ లో ఉన్నాడా, లేడా? అనేది ఆయన అభిమానుల అనుమానం. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఖాళీగా ఉన్నాడంటే ఆశ్చర్యకరమే. త్రివిక్రమ్ స్వతహాగా కథకుడు. కథల విషయంలో ఆయనకు లోటేం ఉండదు. పాయింట్ ఎత్తుకోవాలే కానీ, చకచక అల్లేస్తాడు. మరి సమస్యేమిటి?
సరైన హీరో అందుబాటులో లేకపోవడమే త్రివిక్రమ్ సమస్య. ఆయనకు ఇప్పటికిప్పుడు బన్నీ దొరకడు. తన కోసమే కథ సిద్ధం చేస్తే ఈ యేడాది డిసెంబరు వరకూ ఆగాలి. రామ్, నితిన్ లాంటి యంగ్ బ్యాచ్‌తో త్రివిక్రమ్ సర్దుబాటు కాలేకపోతున్నాడు. పవన్ కల్యాణ్ ఏమో రాజకీయాలలో బిజీ అయిపోయాడు. మహేష్ బాబు లాంటి బడా స్టార్లతో సినిమాలు చేసిన క్యాపబులిటీ ఉన్న త్రివిక్రమ్ ఇప్పుడు కొంచెం దిగి, యంగ్ హీరోలతో సినిమాలు చేయడం ఎందుకని ఆలోచిస్తున్నాడు. ‘గుంటూరు కారం’ క్లీన్ హిట్ అనుకొంటే, తప్పకుండా దొరికిన హీరోతో సినిమా చేసుకొని వెళ్లిపోయేవాడు. కానీ… ‘గుంటూరు కారం’ అనుకొన్న స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు యంగ్ హీరోలతో సినిమాలు చేస్తే, ఇమేజ్ వేరే రకంగా పోట్రయిట్ అయ్యే ప్రమాదం ఉంది. ‘గుంటూరు కారం ఆడలేదు కాబట్టి త్రివిక్రమ్ కు హీరోలు డేట్లు ఇవ్వడం లేద’న్న అపవాదు మోయాల్సివస్తుంది. ఇవన్నీ త్రివిక్రమ్‌కు నచ్చడం లేదు. కొంచెం ఆలస్యమైనా, అన్ని రకాలుగా పర్ఫెక్ట్ అనుకొన్న సినిమాతోనే జనం ముందుకు రావాలి అనుకొంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ ఓ భారీ కాన్వాస్ ఉన్న కథతో ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తోంది. కథకు స్పాన్ చాలా ఎక్కువట. విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా పెద్ద పీట వేసే కథ రాస్తున్నాడట. వాటి గురించి కొంత అదనపు సమయం కావాలని త్రివిక్రమ్ ఫిక్సయ్యాడని, అందుకే సినిమా విషయంలో తొందరపడడం లేదని త్రివిక్రమ్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే ఇంత గ్యాప్. ‘సబర్ కా ఫల్ మీఠా హోతాహై’ అనే ఓ మాట ఉంది. ఎంత ఓపిక పడితే.. అంత తీయని ప్రతిఫలం దక్కుతుంది. మరి త్రివిక్రమ్ ఏం చేస్తాడో..?!