ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. ఉప సభాపతి ఎవరనేది తేల్చకుండానే అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో రానున్న శాసన సభ సమావేశాల్లోనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే, ఎందుకు డిప్యూటీ స్పీకర్ పదవిని హోల్డ్ లో పెట్టారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్పీకర్ , డిప్యూటీ స్పీకర్ పదవులకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటిస్తారని ప్రచారం జరిగినా డిప్యూటీ స్పీకర్ ఎవరనేది మాత్రం తేల్చలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. స్పీకర్ పదవి టీడీపీ నేతకు దక్కడంతో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలో ఒకరికికి ఇస్తారని టాక్ వినిపించింది. కానీ, ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోలేదని అందుకే ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్ ఎవరినేది ప్రకటించలేదని తెలుస్తోంది.
అటు, కూటమి ప్రభుత్వంలో జనసేనకు కీలకమైన మంత్రిత్వ శాఖలు దక్కడంతో తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలంటూ బీజేపీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో జనసేన నుంచి లోకం మాధవి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇలా కూటమి పార్టీలో ఎవరికి ఈ పదవి అప్పగించాలన్న దానిపై కసరత్తు కొలిక్కి రాకపోవడంతోనే డిప్యూటీ స్పీకర్ పదవిని హోల్డ్ లో పెట్టారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.