తెలంగాణలో లోక్ సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ .. అభ్యర్థుల ఎంపికపై మాత్రం జాప్యం చేస్తోంది. సాధారణంగా అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలో దూకుడు ప్రదర్శించడం ఆనవాయితీ. కానీ, అధికార కాంగ్రెస్ ఎందుకో అభ్యర్థుల ఎంపికపై తాత్సారం ప్రదర్శిస్తోంది.
ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థులను ఫిక్స్ చేశాయి. కాంగ్రెస్ కేవలం 9 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించి మిగతా ఎనిమిదింటిని హోల్డ్ లో పెట్టింది. బుధవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు భట్టి , ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లారు.
ఈ సమావేశం అనంతరం తెలంగాణలో పెండింగ్ లో ఉంచిన ఎనిమిది స్థానాలపై స్పష్టత రానుందని అంటున్నారు. కానీ, ఖమ్మం, భువనగిరి స్థానాలపై ఇంకా పీటముడి వీడటం లేదు. ఈ సమావేశం అనంతరం కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వస్తుందా..? మరో విడత అని వాయిదా వేస్తారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.