“పది లేదా పదకొండో తేదీ లోపు …ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ ప్రకటిస్తా…ఆ తర్వాత 48 గంటల్లోనే ప్రజల్లో ఉంటా….” జనసేనాధినేత పవన్ కల్యాణ్… దేవ్ అనే వ్యక్తిని… తన పార్టీ రాజకీయ వ్యూహకర్తగా పరిచయం చేసే సమయంలో అన్న మాటలు. పవన్ చెప్పినట్లు… పది తేదీ అయిపోయింది.. పదకొండో తేదీ అయిపోయింది. కానీ జనసేన తరపున… పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్లే ప్రణాళికలేమీ విడుదల కాలేదు. కొద్ది రోజుల క్రితం.. బస్సుయాత్ర చేయబోతున్నారని.. సకల సౌకర్యాలతో బస్సును సిద్ధం చేస్తున్నారని.. జనసేన అఫీసు నుంచి మీడియాకు లీకులు మాత్రం వచ్చాయి. ఆ తర్వాత సైలెంట్. ఇప్పుడు జనసేనలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు.
ఈ రోజు యాత్ర ప్రకటించి.. రేపట్నుంచి ప్రజల్లోకి వెళ్లిపోతానంటే… రాజకీయాల్లో అంతకు మించి వ్యూహలేమి తనం ఇంకేమీ ఉండదు. అదీ నిరాటంకంగా యాత్ర చేయాలనుకున్నప్పుడు.. బస్సు ఒక్కటి ఉంటే సరిపోదు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలి. రూట్ మ్యాప్‌ల మీద కసరత్తు జరిగిందని ముఖ్య నేతలు..ఏర్పాట్లు చేశారని చెప్పుకొస్తున్నారు కానీ… మంచి క్యాడర్ ఉన్న పార్టీనే… ఇలాంటి మారధాన్ కార్యక్రమాలు చేపట్టాలంటే.. మూడు నెలల ముందుగా కసరత్తు ప్రారంభిస్తుంది. లేకపోతే.. అభాసుపాలవుతామని వారికి తెలుసు. మరి జనసేన తరపున ఏం కసరత్తు చేస్తున్నారో కనీసం స్వచ్చందంగా క్యాడర్‌గా మారిన అభిమానులకు కూడా తెలియదు.
పదిహేనో తేదీ నుంచి బస్సుయాత్ర అని ముందుగానే లీకులిచ్చారు. కానీ పదకొండో తేదీ వరకూ… అధికారిక ప్రకటన రాకపోతే.. అభిమానులు మాత్రం ఏం చేయగలరు. సడెన్ సర్ ప్రైజ్ఇవ్వడానికి ఇదేమీ సినిమా కాదు కదా.. రాజకీయం. అంతా ప్లాన్డ్ గా చేయాలి. లేకపోతే వర్కవుట్ అవదు. బస్సుయాత్రలో జనాలు కనిపించకపోతే.. మొత్తానికే మోసం వస్తుంది. డ్రోన్ కెమెరాలతో పరువు తీయడానికి వైసీపీ, టీడీపీ రెడీగా ఉంటాయి. నిజానికి పవన్ కల్యాణ్.. విదేశీ యాత్ర నుంచి రెండు రోజుల కిందటే వచ్చారు. రెండు సినిమా ఫంక్షన్లలో పాల్గొన్నారు. కానీ బస్సుయాత్రపై అధికారిక ప్రకటన చేయడానికి మాత్రం ఆయనకు తీరికలేకపోయింది.
పవన్ కల్యాణ్ సినిమా స్టైల్లో సీక్రెసీ మెయిన్‌టెయిన్ చేయాల్సిన అవసరం లేదని… అంతర్గత విషయాల్లో అయితే సరే కానీ.. ఇలా ప్రజలతో సంబంధం ఉన్న కార్యక్రమాల వివరాలు కూడా బయటకు తెలియకపోతే ప్రాబ్లం అవుతందంటున్నారు. ఇది మొత్తం ..దేవ్ అలియాస్ వాసుదేవ్ ఫ్రం చింతలబస్తీ వ్యూహాలేనా అని ఫ్యాన్స్ అనుమానపడుతున్నారు. ఎందుకంటే.. ఎంత రచ్చ జరిగినా.. పవన్ దేవ్‌పై నమ్మకం పెట్టుకున్నట్లుగానే ఉంది మరి..!