జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేబినెట్లో చేరికపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం పోస్టుపై ఆసక్తిగా ఉన్నారని జాతీయ మీడియా చెబుతోంది. కానీ పవన్ వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రావడం లేదు. పవన్ కల్యాణ్‌కు సినిమాల కమిట్మెంట్లు ఉన్నాయి. కొన్ని సినిమా షూటింగ్‌లు మధ్యలో ఉన్నాయి.వాటిని అక్కడ ఆపేస్తే వందల కోట్ల నష్టం వస్తుంది. డిప్యూటీ సీఎంగా ఉండి ఆయన సినిమాల్లో నటిస్తే విమర్శలు వస్తున్నాయి.
పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండేందుకు అంగీకరిస్తే.. ఆయనకు ఏకైక డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే జనసేన నుంచి సామాజిక, ప్రాంత సమీకరణాలను బట్టి మరో చాయిస్ ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీకి బంపర్ మెజార్టీ ఉన్నప్పటికీ కలిసి పోటీ చేశారు కాబట్టి కొన్ని మంత్రి పదవులు ఇవ్వాల్సిందే. ఎవరికి ఎన్ని ఇస్తారన్నది సస్పెన్స్ గా మారింది. జనసేన పార్టీకి రెండు, బీజేపీకి ఒక్కటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
టీడీపీ తరపున మంత్రి పదవులకు చాలా గట్టిపోటీ ఉంది. పార్టీ కోసం దశాబ్దాలుగా పని చేస్తున్న వారు ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల వంటి వారు ఉన్నారు. వారందరి ఆకాంక్షల్ని తీర్చాల్సి ఉంది. అలాగే సామాజిక సమీకరణాలు, సామర్థ్యాన్ని కూడా చూడాల్సి ఉంది. ఇలా అన్ని చూసుకుని మంత్రి పదవుల్ని కేటాయించాల్సి ఉంది. అందుకే మిత్రపక్షాలకు మరీ ఎక్కువ ప్రాధాన్యత లభించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు గెలవడం కూడా.. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు సృష్టిస్తుంది.