రాజ్యసభ ఎన్నికలకి నామినేషన్లు వేయడానికి రేపే చివరి రోజు. ఇవాళ్ళ ఉదయం నుండి దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీ సీనియర్ నేతలు, మంత్రులతో ఎడతెగని మంతనాలు చేస్తూనే ఉన్నారు. మొదటతెదేపాకున్న మూడు సీట్లలో ఒకటి రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి ఖరారు చేసారు. మళ్ళీ సాయంత్రం వరకు చర్చలు కొనసాగిన తరువాత, కొద్ది సేపటి క్రితమే మాజీ మంత్రి టి.జి. వెంకటేష్,కేంద్రమంత్రి సుజనా చౌదరికి మిగిలిన రెండు రాజ్యసభ సీట్లను ఖాయం చేసినట్లు ప్రకటించారు.
తెదేపాలో చేరిన 17మంది వైకాపా నేతలతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం సమావేశం అయ్యారు. ఒకవేళ పార్టీ తరపున నాలుగవ అభ్యర్ధిని కూడా నిలబెడితే, గెలిపించుకోగలమా లేదా అనే విషయంపై వారితో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యం కాదని వారు సూచించడంతో ఆ ఆలోచన విరమించుకొన్నట్లు తెలుస్తోంది. కానీ దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రేపు ఉదయం మరొకమారు పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకొంటామని చెప్పారు.
టిజి. వెంకటేష్ కి సీటు కేటాయించబోతున్నట్లు సమాచారం తెలియగానే, రాజ్యసభ సీటు ఆశిస్తున్న పార్టీలో సీనియర్ నేతలలో అసంతృప్తి మొదలయింది. ఎందుకంటే ఆయన 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరినప్పటి నుంచి నేటి వరకు కూడా పార్టీకి చేసిందేమీ లేదు. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవలేకపోయారు. ఇచ్చిన అవకశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోగా ఆ తరువాతః నుంచి పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా తరచూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న నేతలను కాదని అటువంటి వ్యక్తికి రాజ్యసభ సీటు కేటాయిస్తే తెదేపా నేతలు నిరసన తెలియజేయకుండా ఉండలేరు కూడా.