తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
టెట్ పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. టెట్ పరీక్షలు మే 20వ తేదీ నుంచి జూన్ 3వరకు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించారు. తాజాగా వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో పరీక్షల నిర్వహణపై ఎం చేయాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మే 27న పోలింగ్ జరగనుండటంతో సిబ్బంది ఎన్నికల విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో మే 26,27తేదీలలో పరీక్షలను వాయిదా వేస్తే సరిపోతుందా..? లేదంటే పూర్తిగా పరీక్షల షెడ్యూల్ నే మార్చాలా..? అని అధికారులు ఆలోచిస్తున్నారు.
ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్ళారు. ఎం చేయాలన్న దానిపై విద్యాశాఖ ప్రభుత్వానికి పలు సూచనలు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో సర్కార్ నుంచి పూర్తిస్థాయిలో స్పష్టత వచ్చాక టెట్ పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న సస్పెన్స్ కు తెరపడే అవకాశం కనిపిస్తోంది. రెండు రోజులుగా టెట్ అభ్యర్థులు మాత్రం అటు విద్యాశాఖ , ఇటు సర్కార్ నుంచి క్లారిటీ లేకపోవడంతో గందరగోళానికి గురి అవుతున్నారు.