లోక్ సభ స్పీకర్ పదవిపై ఢిల్లీలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూ ఈ పదవి కోసం పట్టుబడుతున్నట్లు జాతీయ మీడియా చెబుతోంది. అయితే పూర్తి మెజార్టీ లేనందున అత్యంత కీలకమైన స్పీకర్ పదవిని మిత్రపక్షాలకు ఇచ్చే ప్రశ్నే లేదని బీజేపీ అంటోంది. 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్లుగా ఎన్నికయ్యారు. ఆ రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించడంతో చాయిస్ ఆ పార్టీదే అయింది.
ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్… ఇద్దరూ సీనియర్లే. స్పీకర్ పదవి ప్రయారిటీ వారికి తెలుసు. ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులోకి వచ్చిన తర్వాత స్పీకర్ పదవికి మరింత బలం లభించింది. ఫిరాయింపులకు పాల్పడే సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో నిర్ణయం తీసుకునే విశేషాధికారం స్పీకర్ కు ఉంది. మహారాష్ట్ర, బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పడం కష్టం. అందుకే ఈ ప్రాంతీయపార్టీలు స్పీకర్ కోసం పట్టుబడుతున్నాయి.
అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం.. ఇలాంటి ఆశలు ఎన్ని అయినా పడవచ్చు కానీ స్పీకర్ పదవిని మాత్రం ఇచ్చేది లేదని అంటున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ ఇస్తామని ప్రతిపాదన పెడుతున్నారు. కావాలంటే పురందేశ్వరికే స్పీకర్ పదవి ఇస్తామన్న ప్రతిపాదనను కూడా పెట్టినట్లుగా చెబుతున్నారు. కానీ చంద్రబాబు స్పీకర్ పదవి టీడీపీకే పట్టుబడుతున్నారని అంటున్నారు. అయితే ఇది జాతీయ మీడియా కల్పనా లేకపోతే నిజంగానే చంద్రబాబు పట్టుబడుతున్నారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.