ఇళ్ల స్థలాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏపీలో చర్చనీయాంశమవుతోంది. వైసీపీ మద్దతుదారులే ఆ పిటిషన్లు వేసినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పిటిషనర్ల పేర్లు, వైసీపీతో వారి అనుబంధం, ముఖ్యనేతలతో వారు దిగిన ఫోటోలను కూడా ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో అసలు ఆ పిటిషన్లను వారికి తెలియకుండానే వేశారన్న వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. హైకోర్టునే మోసం చేశారంటూ కథనాలను రాస్తున్నారు. కొంత మంది పిటిషనర్ల స్టేట్మెంట్లను కూడా ప్రచురించారు. వారు తమకేమీ సంబంధం లేదని చెప్పినట్లుగా ఆస్టేట్మెంట్లు ఉన్నాయి.
నిజానికి వారి పేరుపై హైకోర్టులో పిటిషన్లు వేసి ఉంటే తీర్పు వచ్చే వరకూ వారికి తెలియదని అనుకోవడం విచిత్రం. ఎందుకంటే ఉత్తరప్రత్యత్తరాలు, సమాచారం అంతా పిటిషనర్లకు అందుతుంది. ఒక వేళ వారు కాకుండా మధ్యవర్తులు ఉన్నారనుకంటే వారికి చేరుతుంది. ఆ పిటిషన్లు దాఖలు చేసిన వారెవరు.. లాయర్‌ను మాట్లాడిందెవరు.. వాదనలు వినిపించిందెవరు అనేది తెలుసుకోవడం ఈజీనే. నిజానికి ఆ పిటిషన్లు తాము దాఖలు చేయలేదనుకుంటే.. వెంటనే వారందరూ.. పిటిషన్లు ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంది . కానీ ఎందుకో రాజకీయ ప్రకటనలపై ప్రభుత్వం, అధికార పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
పరిస్థితి చూస్తూంటే ఇళ్ల స్థలాలు, ఇళ్ల విషయాన్ని రాజకీయం చేసేసి..పేదలకు అన్యాయం చేసే ప్రక్రియ ఏదో నడుస్తోందన్న అభిప్రాయం అందరిలోనూ ఏర్పడుతోంది. ఎవరు కోర్టుకెళ్లారు.. కోర్టులో అలాంటి తీర్పు ఎలా వచ్చింది..ప్రభుత్వం ఎందుకు సమర్థమైన వాదనలు వినిపించలేకపోయింది.. ఇలాంటి విషయాన్నీ ఇప్పుడు చర్చనీయాంశమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ ఆ పిటిషన్లను లబ్దిదారులు వేయకపోతే .. ఎవరు వేశారో.. వారు టీడీపీ వాళ్లా..? వైసీపీ వాళ్లా ? ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది.